ఆయనో కేంద్ర మాజీ మంత్రి, వయసు 60 ఈ వయసులో ఆయన పెళ్లికొడుకయ్యారు. మహారాష్ట్రకు చెందిన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ముకల్ వాస్నిక్ తన స్నేహితురాలు రవీనా ఖురానాను వివాహం చేసుకున్నారు.

ఢిల్లీలోని ఓ హోటల్‌లో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ముకల్, ఖురానాలను ఒక్కటయ్యారు. ఈ వేడుకకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఇతర నేతలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

Also Read:కాంగ్రెస్ రథసారథిగా ముకుల్ వాస్నిక్...?

ముకుల్ వాస్నింగ్  కాంగ్రెస్ పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించడంతో పాటు కేంద్రమంత్రిగానూ పనిచేశారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాల నుంచి తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ముకుల్ వాస్నిక్ పేరు బాగా వినిపించింది.

కాగా ముకుల్ వాస్నిక్, రవీనా పెళ్లిపై రాజస్థాన్ సీఎం స్పందిస్తూ.. మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు, కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు గెహ్లాట్ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

Also Read:23ఏళ్ల పెళ్లి బంధం... సోషల్ మీడియాలో ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్

మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ స్పందిస్తూ.. తాను 1984లో ముకుల్‌ను, 1985లో రవీనాను మొదటిసారి కలిశానన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తామంతా కలిసి గతంలో మాస్కోలో జరిగిన వరల్డ్ యూత్ స్టూడెంట్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యామంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.