న్యూల్లీ: 134ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించేందుకు రథసారథి ఎవరా అన్న ఉత్కంఠకు తెరపడింది. వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ కు ఇకపై దశ దిశ చూపించే అధినేత ఎంపిక దాదాపు ఖరరైనట్లు తెలుస్తోంది. 

గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు, సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు, రాజకీయ కార్యదర్శి ముకుల్ వాస్నిక్ కు అధినేత బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అధికారికంగా శనివారం సీడబ్ల్యూసీ ప్రకటించనుందని తెలుస్తోంది.   

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి ఎంపిక ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఈసారి గాంధీ కుటుంబం కాకుండా వేరేవారికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అయిన ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, యువనేత జ్యోతిరాధిత్య సింధియా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 

అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు పార్టీ సీనియర్ నేతలు మెుగ్గు చూపలేదు. రోజురోజుకు పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమవుతున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు వేగం చేసింది. 

జమ్ముకశ్మీర్ విభజన అనంతరం లోక్ సభలో జమ్ముకశ్మీర్ విభజన బిల్లు పాస్ అయిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికపై వాడీ వేడిగా చర్చించారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండనని తేల్చిన నేపథ్యంలో కొత్తవారిని ఎంపిక చేయాలని సోనియాగాంధీ ఆదేశించారు. 

అనంతరం శుక్రవారం యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులు అయిన ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కేసీవేణుగోపాల్ లు సోనియాతో సమావేశమై నూతన అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. 

ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్‌ నేత ముకుల్‌ వాస్నిక్‌ పేరును యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తెరపైకి తెచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడి రేసులో ముకుల్ వాస్నిగ్ ముందు వరుసలో ఉన్నారని కూడా తేల్చి చెప్పారు. 

సోనియాగాంధీ పరోక్షంగా చెప్పడంతో ముకుల్ వాస్నిక్ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ దేశవ్యాప్తంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శనివారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ముకుల్ వాస్నిక్ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

నూతన అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ ప్రకటిస్తే ఆయనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారా లేక కొత్త సారథిగానే పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇకపోతే ముకుల్ వాస్నిక్ ఏఐసీసీలో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

అనూహ్యంగా తెరపైకి వచ్చిన ముకుల్ వాస్నిక్:
ముకుల్ వాస్నిక్ ప్రస్తుతం ఏసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ముకుల్ వాస్నిక్ వయసు 59ఏళ్లు. ముకుల్‌ వాస్నిక్‌ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయత కుటుంబం. కాంగ్రెస్‌ అగ్రనేత, మాజీఎంపీ బాలకృష్ణ వాస్నిక్‌ కుమారుడు. 

యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ముకుల్ వాస్నిక్  తన 25ఏళ్ల వయసులోనే 1984లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1984 నుంచి 1986 వరకు ఎన్ఎస్ యూ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988 నుంచి 1990 మధ్య ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 

ఇకపోతే పీవీ నరసింహరావు, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. అంతేకాదు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా వ్యవహరించారు. 

పాలనా వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ముకుల్ వాస్నిక్ అయితే  కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. శనివారం  సీడబ్ల్యూసీ అధికారికంగా ముకుల్  వాస్నిక్ పేరును ప్రకటించనుందని తెలుస్తోంది.