Asianet News TeluguAsianet News Telugu

న్యాయ శాఖ మంత్రి సమక్షంలో కొలీజియంపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు.. ‘వారు భయపడుతున్నారు’

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో దేశ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కొలీజియం వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యవస్థకు అవసరమైన నిర్ణయాలను అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాలని కేంద్రమంత్రి పేర్కొనగా.. నేషనల్ పర్‌స్పెక్టివ్ దృష్ట్యా కొలీజియం సరైన పరిపాలన నిర్ణయాలు తీసుకుంటుందని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు.
 

cji dy chandrachud big remarks in law minister kiren rijiju presence on collegium system
Author
First Published Nov 20, 2022, 12:57 PM IST

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల ఎంపిక, బదిలీలపై నిర్ణయాలు తీసుకునే కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా చిన్నపాటి అసంతృప్తిని వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోణంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే ఈ వ్యవస్థలో పారదర్శకత ఉండదని, ఈ వ్యవస్థపై సమీక్ష చేయాలని ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన సమక్షంలోనే కొత్త సీజేఐ డీవై చంద్రచూడ్ కొలీజియం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎదుటే కొలీజియం వ్యవస్థను సమర్థించారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమానికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ కొలీజియం వ్యవస్థను సమర్థించారు. జాతీయ విధానాలు, దృక్పథాలను దృష్టిలో ఉంచుకుని కొలీజియం వ్యవస్థ పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు.

Also Read: కొలీజియం వ్యవస్థ వల్ల దేశ ప్రజలు సంతోషంగా లేరు - కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు

అదే విధంగా కింది స్థాయి కోర్టుల న్యాయమూర్తులు తీవ్ర నేరాల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి భయపడుతున్నారని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషనలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయని తెలిపారు. ఇందుకు కారణం దిగువ స్థాయి న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వడానికి జంకడమే అని పేర్కొన్నారు. అంటే.. ఆ న్యాయమూర్తులు నేర తీవ్రతను అర్థం చేసుకోరని కాదు.. కానీ, దారుణమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇస్తే వారిని టార్గెట్ చేసుకుని దాడులకు దిగబడే ముప్పు ఉన్నదని జడ్జీలు భయపడుతున్నారని వివరించారు.

Also Read: సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీల ప్యానెల్‌లో భిన్నాభిప్రాయాలు!.. సీజేఐకి ఓ లేఖ

ఈ కార్యక్రమంలోనే న్యాయమూర్తుల స్ట్రైక్ గురించి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. న్యాయమూర్తుల బదిలీ విషయమై న్యాయమూర్తులు ధర్నా చేస్తున్నారని తనకు తెలిసిందని వివరించారు. దానితోపాటే కొందరు న్యాయమూర్తులు సీజేఐని కలువాలని కోరుతున్నట్టు తెలిసిందని అన్నారు. ఆయన ఒక్కరే అయి ఉండొచ్చు కానీ, ఇలా కొలీజియం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఇలాంటి పరిణామాలే ఎదురైతే పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇలాగైతే మొత్తం డైమెన్షన్‌నే మార్చాల్సి వస్తుందని తెలిపారు. ఇలా తరుచూ వివాదాలు కాకుండా అందరూ కలిసి వ్యవస్థకు అవసరమైన సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Also Read: కొలీజియం నియామకాల వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది - కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు

సీజేఐగా బాధ్యతలు తీసుకున్నాక నవంబర్ 16న తొలిసారి కొలీజియం సమావేశాన్ని నిర్వహించిన జస్టిస్ చంద్రచూడ్ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులను(మద్రాస్, గుజరాత్, తెలంగాణ) పరిపాలనపరమైన కారణంగా బదిలీ చేశారు. అప్పటి నుంచి న్యాయవాదులు ధర్నాకు దిగారు. గుజరాత్ బార్ నుంచి ప్రతినిధులతో మాట్లాడటానికి సీజేఐ చంద్రచూడ్ అంగీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios