Telangana: ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం చాలా కాలం నుంచి నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భ‌ర్తి గురించి అసెంబ్లీలో ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే కేంద్రం పార్ల‌మెంట్ లో పేర్కొన్న 8 లక్ష‌ల పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ డిమాండ్ చేశారు. 

Telangana: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని 8.67 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 8 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. అదే విషయాన్ని ప్ర‌స్తావించిన మంత్రి.. ఆ ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌న్నారు. ‘‘ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గత ఎనిమిదేళ్లుగా ఎలాంటి నియామకం జరగకపోవడంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది' అని దయాకర్ రావు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకాల కోసం ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని తెలంగాణ బీజేపీ నేతలకు మంత్రి ద‌యాక‌ర్ రావు సూచించారు. "తెలంగాణలో 80,000 ఉద్యోగాల నియామకాల ప్రకటనను రాష్ట్ర భార‌తీయ జ‌నతా పార్టీ చీఫ్ బండి సంజయ్ మరియు ఇతర బీజేపీ నాయకులు అంగీకరించడానికి ఇష్టపడరు. నిరుద్యోగ యువకుల పట్ల వారికి సానుభూతి ఉంటే నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని" అని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 80000 పోస్టుల భర్తీతో పాటు 11000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ద‌యాక‌ర్ రావు తెలిపారు. తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర శాఖల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా త్వరలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది అని ఆయ‌న వెల్ల‌డించారు.

కాగా, బుధ‌వారం నాడు అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక, కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల ద్వారా ఏటా 7వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ముందే గుర్తించి.. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగుల భర్తీ చేపడతామని వెల్లడించారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఈ క్రమంలోనే ప్రతిపక్షాల చేస్తున్న వ్యాఖ్యలపై... 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో Congress, BJP ల్లో వణుకు మొదలైందన్నారు మంత్రి హరీష్ రావు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టుల భర్తీ ఏనాడైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచనలు చేస్తారని తాను అనుకొన్నానన్నారు. రాజకీయ విమర్శలు తప్పా ఎలాంటి సూచనలు చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వాస్తవాలు మాట్లాడితే మంచిదని హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సూచించారు.