నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు కొనసాగుతోంది. ఏఏ అసెంబ్లీల్లో ఎందుకు ఉపఎన్నికలు జరుగుతున్నాయో తెలుసా?
By Elections 2025 : గురువారం (జూన్ 19న) దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో రెండు, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ లో ఒక్కో అసెంబ్లీ స్థానం వివిధ కారణాలతో ఖాళీ అయ్యాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు ఇటీవలే ఈసి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే నామినేషన్, ప్రచారం ప్రక్రియ ముగియగా ఇవాళ కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇవాళ ఉదయమే పోలింగ్ ప్రారంభంకాగా సాయత్రం ఐదుగంటల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే అన్ని నియోజకవర్గాల్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది... ఓటు హక్కును వినియోగించుకునేందకు ప్రజలు భారీగా పోలింగ్ బూత్ లకు తరలివెళుతున్నారు. దీతో ఇప్పటివరకు పోలింగ్ శాతం మెరుగ్గానే ఉన్నట్ల ఈసి అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఓటర్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
జూన్ 23న అంటే వచ్చే సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్పారు. ఇందుకోసం కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బైపోల్ లో ఎన్డిఏ, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఏ అసెంబ్లీలో ఎందుకు బైపోల్ జరుగుతుందంటే..
1. గుజరాత్ :
బిజెపి కంచుకోట గుజరాత్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి బిజెపి సిట్టింగ్ స్థానం కాగా మరొకటి ఆప్ ది. కడి అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యే కర్సన్ భాయ్ సోలంకి మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్, ఆప్ పోటీలో నిలిచాయి.
ఇక విశావదర్ అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ ఆప్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
2. కేరళ :
కేరళలో ఉప ఎన్నిక జరుగుతున్న నీలంబూర్ అసెంబ్లీలో అధికార CPI(M) నేతృత్వంలోని LDF (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్), కాంగ్రెస్ నేతృత్వంలోని UDF (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ బిజెపి సారథ్యంలోని ఎన్డిఏ, తృణమూల్ కాంగ్రెస్ కూడా అభ్యర్థులకు బరిలోకి దింపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పివి అన్వర్ రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
3. పశ్చిమ బెంగాల్ :
పశ్చిమ బెంగాల్ లోని కలిగంజ్ లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అధికార టిఎంసి సిట్టింగ్ ఎమ్మెల్యే నసీరుద్దిన్ అహ్మద్ మరణంతో బైపోల్ అనివార్యం అయ్యింది. ఇక్కడ టిఎంసి, బిజెపి మధ్య ప్రధాన పోటీ నెలకొంది... కాంగ్రెస్-వామపక్ష పార్టీల కూటమి ఈ ఉపఎన్నికల బరిలో నిలిచాయి.
4. పంజాబ్ :
లూథియానా సిట్టింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణంతో ఉపఎన్నిక జరుగుతోంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ సీటు.. ఇక్కడ పట్టు నిలుపుకునేందుకు ఎంపీ సంజీవ్ అరోరాను ఆప్ బరిలో నిలిపింది. ఇక్కడ కాంగ్రెస్, బిజెపితో పాటు శిరోమణి అకాలీదళ్ కూడా బరిలో నిలిచాయి.
