బ్రేకింగ్.. బెంగళూరులో భారీ ఉగ్రదాడి భగ్నం.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కర్ణాటక రాజధాని బెంగళూరుకు పెద్ద ప్రమాదం తప్పింది. సిటీలో ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు.

బెంగళూరులో భారీ ఉగ్రదాడిని పోలీసులు భగ్నం చేశారు. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ ఉగ్రవాదులు పట్టుపడటంతో కర్ణాటక రాజధానికి పెద్ద ప్రమాదమే తప్పింది.
అరెస్టయిన ఉగ్రవాద అనుమానితులు దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను సయ్యద్ సుహైల్, ఉమర్, జునైద్, ముదాసిర్, జాహిద్ గా గుర్తించారు. వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.
అరెస్టయిన వ్యక్తులు బెంగళూరులో పెద్ద ఎత్తున దాడులకు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టయిన వారు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన వారని తెలుస్తోంది. ఈ సంస్థకు జునైద్ అధిపతిగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. గుజరాత్ సరిహద్దు లేదా పంజాబ్ సరిహద్దు గుండా పేలుడు పదార్థాలను సేకరించడానికి అతడు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.