తండ్రితో వ్యక్తిగత కక్షలు.. ముగ్గురు పిల్లలను కారుతో ఢీకొట్టి, చక్రాల కింద నలిపే ప్రయత్నం.. వీడియో వైరల్
తండ్రితో ఉన్న కోపాన్ని ఓ వ్యక్తి అతడి పిల్లలపై చూపించాడు. పదేళ్లలోపు వయస్సున్న ముగ్గురు చిన్నారులను కారుతో ఢీకొట్టాడు. వారిపై కారు ఎక్కించాలని ప్రయత్నించినా.. స్థానికులు అడ్డుకోవడంతో అది సాధ్యం కాలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలను ఓ వ్యక్తి కావాలనే తన కారుతో ఢీకొట్టాడు. అనంతరం కారు చక్రాల కింద వారిని నలిపేయాలని ప్రయత్నించాడు. అక్కడున్న వారు పరుగున వచ్చి, అతడిని ఆపారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో జూలై 13న ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మలిహాబాద్ సమీపంలోని సింధర్వ గ్రామంలోని ఖాజీ ఖేడాలో సీతారం తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు 8 ఏళ్ల శివానీ, 4 ఏళ్ల స్నేహ, 3 ఏళ్ల కృష్ణ అనే పిల్లలు ఉన్నారు. అయితే సీతారంకు స్థానికంగా నివసించే బంధువు గోవింద్ యాదవ్ తో గొడవలు ఉన్నాయి.
ఈ క్రమంలో జూలై 13వ తేదీన సీతారం ముగ్గురు పిల్లలు సమీపంలోని మార్కెట్ కు వెళ్లారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గోవింద్ అటు నుంచి కారు నడుపుకుంటూ వస్తున్నాడు. రోడ్డుపై నడుస్తున్న పిల్లలను చూశారు. అయితే తండ్రిపై ఉన్న కక్షతో వారిని వేగంగా కారుతో ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు పిల్లలు కింద పడ్డారు. అనంతరం వారిపైకి టైర్లను కూడా ఎక్కించేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న ప్రజలు కారు వైపు పరిగెత్తకుంటూ వచ్చారు.
వ్యాపారంలో లాభాలు వస్తాయని మేనకోడలిని బలిచ్చిన వ్యాపారి.. పంజాబ్ లో ఘటన
నిందితుడిని నిలువరించారు. కారు కదలకుండా చేశారు. ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించారు. దీంతో గోవింద్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతడిని స్థానికులు పారిపోకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలియడంతో పిల్లల తండ్రి సీతారం కూడా అక్కడికి వచ్చాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మలిహాబాద్ పోలీస్ స్టేషన్ లో అతడిపై అభియోగాలు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లక్నో పోలీసులు ట్వీట్ చేశారు. కాగా.. పిల్లలు నడుచుకుంటూ మార్కెట్ కు వెళ్లడం, కారు వచ్చి వారిని ఢీకొట్టడం, స్థానికులు నిందితుడిని పారిపోకుండా అడ్డుకోవడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.