Vande Mataram: దేశభక్తికి ప్రతీకగా భావించే వందే మాతరం గేయానికి కేంద్ర ప్రభుత్వం మరింత చట్టబద్ధమైన రక్షణ కల్పించింది. దీనికి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

వందే మాతరానికి చట్టబద్ధ రక్షణ

ఇప్పటి వరకు జాతీయ గీతం 'జనగణమన'కు మాత్రమే ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉండేది. జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, కార్యక్రమానికి అంతరాయం కలిగించడం వంటి చర్యలు శిక్షార్హమైన నేరాలుగా ఉండేవి. అయితే వందే మాతరం విషయంలో అలాంటి ప్రత్యేక నిబంధన లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1971లో అమల్లోకి వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ చట్టంలో సవరణలు చేసి, వందే మాతరాన్ని కూడా అదే చట్ట పరిధిలోకి తీసుకొచ్చింది.

ఇకపై ఏ శిక్షలు ఉంటాయి?

రాష్ట్రపతి ఆమోదంతో ఈ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది. దీంతో ఇకపై వందే మాతరం పాటను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, పాట పాడుతున్న కార్యక్రమానికి ఆటంకం కలిగించడం లేదా అవమానించేలా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి చర్యలకు గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. చట్టాన్ని పదేపదే ఉల్లంఘించిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు కూడా కొనసాగుతాయి.

వందే మాతరానికి సమాన గౌరవం ఎందుకు?

భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న చేసిన ప్రకటనలో బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన 'వందే మాతరం'కు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. అందువల్ల జాతీయ గీతం 'జనగణమన'తో సమాన గౌరవం వందే మాతరానికి కూడా ఇవ్వాలని అప్పుడే ప్రకటించారు. అదే అంశాన్ని ఇప్పుడు చట్టపరంగా బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను తీసుకొచ్చింది.

కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల వందే మాతరం ఆలాపనపై కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని ఎర్రకోటపై తొలిసారిగా వందే మాతరం ఆలపించనున్నారు. అలాగే అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం, జనగణమన రెండూ ఉంటే ముందుగా వందే మాతరం, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని సూచించింది. వందే మాతరం పాడుతున్న సమయంలో కూడా సభలో ఉన్న వారంతా అటెన్షన్‌లో నిలబడాలని ఆదేశించింది. అదనంగా, దేశంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు తరగతులు ప్రారంభించే ముందు వందే మాతరం సామూహికంగా ఆలపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.