పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. అయితే ఈ విషయంలో అధికార పార్టీ కాస్త ముందుంది. అందరికంటే ముందే తమ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను బుధవారమే జేడి(యు) ప్రకటించింది. అయితే ఈ లిస్ట్ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. 

ఈ జాబితాలో ఓ సెక్స్ రాకెట్ నిందితురాలి చోటు దక్కింది. 2018లో ముజఫర్‌పూర్ లో బయటపడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రధాన నిందితురాలికి ఎమ్మెల్యే అభ్యర్థులు లిస్ట్ లో చోటు దక్కింది. సెక్స్ రాకెట్‌లో కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి మంజు వర్మకు ఈసారి జేడి(యూ) టికెట్ దక్కదని అందరు భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకు అభ్యర్థుల జాబితాలో చోటు దక్కింది. ఆమెకు బెగుసరాయి జిల్లాలోని చెరియా-బరియార్‌పూర్ అసెంబ్లీ సీటును కేటాయించారు. 

ఇక బిహార్ డిజిపిగా పనిచేసి స్వచ్చంద పదవీ విరమణ పొంది అధికార జేడి(యూ)లో చేరిన మాజీ డిజిపి గుణశేఖర్ పాండే పేరు ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాలో చోటు దక్కలేదు. బక్సర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి ఆయన ఆసక్తిచూపారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో పాండే ఆశలు ఆవిరయ్యాయి. 

రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలుండగా జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేస్తూ మిగతా స్థానాలను మిత్రపక్షం బిజెపికి వదిలేశారు. దీంతో బుధవారం 115 స్థానాల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థుల జాబితాను జేడీయూ విడుదల చేసింది.