Bulli Bai: బుల్లిబాయ్ యాప్ కేసు.. ఒకరి అరెస్టు.. సమాచారం లేదన్న బెంగళూరు పోలీసులు !
Bulli Bai: ముస్లిం మహిళలను టార్గెట్ చేస్తూ.. బుల్లిబాయ్ యాప్ లో ఫొటోలు అప్‌లోడ్ చేసి.. వేలం వేస్తున్న వికృత చేష్టల అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ముంబయి పోలీసులు.. బెంగళూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్టు చేసినట్టు సమాచారం.
Bulli Bai: అందివచ్చిన సాంకేతికతను అవకాశంగా మార్చుకోవాల్సింది పోయి.. కొందరు దానిని దుర్వినియోగానికి వినియెగిస్తున్నారు. ఈ క్రమంలోనే దారణాలకు ఒడిగడుతున్నారు. సమాజిక మాధ్యమాల్లో అయితే పోకిరీల చర్యలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఈ నేపథ్యంలోనే పలువురు దుండగులు అమ్మాయిలను ఆన్‌లైన్ లో వేలానికి పెట్టారు. మరీ ముఖ్యంగా ముస్లిం వర్గం వారిని టార్గెట్ చేసి మరీ.. వారి ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి.. వేలం నిర్వహిస్తున్నారు. దీనికి కోసం ప్రత్యేకంగా ఓ యాప్ నే సృష్టించారు. అదే "బుల్లిబాయ్"(Bulli Bai). ఇటీవల ఈ యాప్, అమ్మాయిలను వేలం వేయడం గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వెల్లడించడంతో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లతో పాటు ప్రజలందరి నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ‘బుల్లిబాయ్’ పేరిట యాప్‌ను సృష్టించి వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి.
Also Read: COVID-19: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా.. మరో బీజేపీ నేతకు సైతం..
ఈ నేపథ్యంలోనే ముంబయి, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో బుల్లిబాయ్, సహా సంబంధిత యాప్‌లపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకోవడినికి చర్యలు తీసుకుంటున్నారు. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న 'బుల్లి బాయ్' కేసులో ముంబయి పోలీసులు.. బెంగళూరు నగరానికి చెందిన 21 ఏండ్ల ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్టు చేసినట్లు సమాచారం. మిగతా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు తెలిసింది. ఇక బుల్లిబాయ్ యాప్ కేసులు బెంగళూరులో అరెస్టుల గురించి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మీడియాతో మాట్లాడుతూ.. ముంబయి పోలీసులు నగరంలో బుల్లిబాయ్ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న సమాచారం తమ వద్ద లేదని తెలిపారు. దీనికి సంబంధించి ముంబయ్ పోలీసులు తమకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు వారు ఎలాంటి సహాయాన్ని కోరలేదన్నారు. నగరం నుంచి వారు ఎవరిని అదులోకి తీసుకున్నారో లేదా అరెస్టు చేశారో తమకు తెలియదని తెలిపారు.
Also Read: Modi: పంజాబ్ పర్యటనకు ప్రధాని మోడీ.. ఎన్నికల లక్ష్యంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం !
బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అసహ్యకరమైన ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌ను పంచుకున్నాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నామని ముంబయి పోలీసులు తెలిపారు. ఇతనికి బుల్లిబాయ్ తో సంబంధం అంశాలపైనా కూడా ముంబయి క్రైమ్ బ్రాంచ్ సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇదిలావుండగా, బుల్లిబాయ్ యాప్ గురించి జనవరి 1న సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇందులో ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఫొటోలను అప్‌లోడ్ చేసి.. వేలం పాడుతున్న అంశం వెలుగులోకి వచ్చింది. ముస్లిం మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ.. గతేడాది జులైలోనూ ‘Sulli Deals’ app వెలుగులోకి వచ్చింది. దీనికి క్లోన్ యాప్‌గా బుల్లిబాయ్ పుట్టుకొచ్చింది. దీని బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: coronavirus: భారత్ లో కరోనా కల్లోలం..37 వేలకు పైగా కొత్త కేసులు.. 1892 ఒమిక్రాన్ కేసులు..