బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆ దేశంతో పాటు ఇండియాలోనూ ఓటు హక్కు ఉండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న న్యూటన్ దాస్ అనే వ్యక్తి ప్రస్తుతం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌గా ఉన్నాడని తెలుస్తోంది. దీనిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది.
ఎవరీ న్యూటన్ దాస్.?
న్యూటన్ దాస్ అనే వ్యక్తి 2024లో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్నాడు. అయితే ఆయన భారతదేశ పశ్చిమ బెంగాల్‌లోని కాక్‌ద్వీప్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ అని తెలుస్తోంది. ఆయన 2014 నుంచి అక్కడ ఓటర్‌గా ఉన్నానని చెబుతున్నారు.
2017లో ఓటర్ కార్డు పోగొట్టుకుని, 2018లో టీఎంసీ ఎమ్మెల్యే మంటురాం పాఖిరా సహాయంతో కొత్త కార్డు తీసుకున్నానని చెప్పాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తానే స్వయంగా ఓటేశానని తెలిపాడు. అయితే ఆయన బంధువు టపన్ దాస్ మాత్రం, న్యూటన్ బంగ్లాదేశ్‌లోనే జన్మించారని, అక్కడా ఓటేశారు అని ఆరోపించారు.
బీజేపీ నేతలు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగినదేం కాదు, "టీఎంసీ కుట్ర పథకం" అని బీజేపీ ఆరోపిస్తోంది. న్యూటన్ లాంటి వేల మంది "బంగ్లాదేశ్ న్యూటన్లు" పశ్చిమ బెంగాల్‌లో ఓటేస్తున్నారని విమర్శించారు. శరణార్థుల పేరుతో అక్రమ ఓటర్లను జాబితాలో చేరిస్తూ, టీఎంసీ ఎన్నికల్లో గెలవడం కోసం పథకం రచిస్తోంది అని ఆరోపించారు.
టీఎంసీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. "సరిహద్దు భద్రత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదిష అని అంటున్నారు. అక్రమంగా దేశంలోకి ఎవరైనా వచ్చినా, అది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కర్తవ్యమని చెబుతున్నారు. అలాగే ఓటరు జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి అని చెప్పారు.
ఇతర రాష్ట్రాల ప్రజలను పశ్చిమ బెంగాల్ ఓటరు జాబితాలో చేర్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫిబ్రవరిలోనే ఆరోపించారు.
ఇదిలా ఉంటే 2024లో బంగ్లాదేశ్‌లో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే .ఈ ఉద్యమం చివరికి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. ఆమె 16 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన తర్వాత, 2024 ఆగస్టులో పదవిని వదిలి దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. హసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటోంది.
