పాట్నా: ఈ సంవత్సరం అక్టోబర్లో బీహార్లో ఎన్నికల సమరానికి తెరలేవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిస్థితులు రోజురోజుకు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. తాజాగా జేడీయూ బహిష్కృతనేత ప్రశాంత్ కిషోర్ కదలికలు అక్కడ మరింత చర్చనీయాంశంగా మారుతూ నూతన రాజకీయ సమీకరణలకు తెరతీసేదిలా కనబడుతుంది. 

జేడీయూ నుంచి ఉద్వాసనకు గురయిన తరువాత ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరీ బాత్ బీహార్ కి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నానని చెప్పిన రెండు రోజులకే.... ఆయన బీహార్ లోని ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. 

ఆయన ప్రత్యేకంగా పార్టీ పెడుతాననే విషయం ప్రకటించకపోయినా ఆయన బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్రను వేయాలని బలంగా ప్రయత్నిస్తున్నాడు.  పార్టీ పెట్టి దాన్ని విస్తరించి ఎన్నికలకు వెళ్లే సమయం లేనందున బహుశా ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. 

Also read: బాత్ బీహార్ కి: ప్రశాంత్ కిషోర్ "యువత" రాజకీయ వ్యూహమిదే...

ఆయన ఇప్పుడు బీహార్ లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని తీసుకువచ్చి అందులో దాదాపుగా అన్ని ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఒక ఆలోచన అందులో ఉన్నట్టుగా మనకు అర్థమయిపోతుంది. 

తాజాగా ఆయన బీహార్ లో ప్రతిపాక్షాలుగా ఉన్న హిందుస్తానీ అవామీ మోర్చా అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంఝితో సమావేశమయ్యారు. జితిన్ రామ్ మంఝితో పాటుగా ఆయన మరో ప్రతిపక్షనేత ఉపేంద్ర కుష్వాహాతో కూడా భేటీ అయ్యారు. 

ఆర్ ఎల్ ఎస్ పి పార్టీ అధ్యక్షుడయిన ఈ మాజీ కేంద్రమంత్రి తో కూడా భేటీ అవడం ఇప్పుడు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న కుష్వాహా... 2019 ఎన్నికలకు ముందు కూటమిని వీడి బయటకు వచ్చాడు. 

ఇలా ఇప్పుడు బీహర్ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ ఇలా ప్రతిపక్షాల కూటమిని ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తున్న వేళ ఎలాంటి నూతన రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇప్పటికే అక్కడ కాంగ్రెస్-ఆర్జేడీ-విఐపి-ఆర్ ఎల్ ఎస్ పి- హిందుస్తానీ అవామ్ మూర్ఛలు ఒక కూటమిగా గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసాయి. లెఫ్ట్ వేరుగా పోటీ చేయగా, బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేసాయి. 

ఇప్పుడు అక్కడ ఒక నూతన రాజకీయ సమీకరణం తీసుకురావాలంటే... విపక్షాలన్నిటిని ఒక్క తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ వారి వారి నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ ఎలా అన్ని రాజకీయ పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకురాగలుగుతాడో చూడాల్సి ఉంటుంది. ఆర్జేడీ నుంచి ఇప్పటికే తేజశ్వి యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతానికి అక్కడ నితీష్ కుమార్ కి దీటు రాగలిగే సత్త ఉన్న నాయకుడు ఎవరు లేదు. 

ఇలా అన్ని పార్టీలు ఒకరితో ఒకరు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతుండగా.... నితీష్ కుమార్ కు పోటీ రాగలిగే మరో ముఖ్యమంత్రి అభ్యర్థే లేనివేళ ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో ఎలాంటి నూతన రాజకీయ సమీకరణలకు తెరలేపుతాడో వేచి చూడాలి!