యూనిఫాం సివిల్ కోడ్ ముందుగా హిందువులకే వర్తింపజేయాలని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు అందరినీ ఆలయాల్లో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఏకీకృత పౌరస్మృతి అమలుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) తప్పుబట్టింది. డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. మొదట హిందూ మతంలోనే దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‘‘యూనిఫామ్ సివిల్ కోడ్ ను మొదట హిందూ మతంలో ప్రవేశపెట్టాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో సహా ప్రతీ వ్యక్తిని దేశంలోని ఏ ఆలయంలోనైనా పూజ చేయడానికి అనుమతించాలి’’ అని ఇళంగోవన్ అన్నారు. రాజ్యాంగం ప్రతీ మతానికి రక్షణ కల్పించింది కాబట్టే తమకు యూసీసీ అవసరం లేదని ఇళంగోవన్ అన్నారు.
కాగా.. దేశం రెండు చట్టాలపై నడవజాలదని, ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగంలో భాగమని ప్రధాని మోదీ మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘‘నేడు యూసీసీ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెండు (చట్టాలు) మీద దేశం ఎలా నడుస్తుంది? రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతుంది. సుప్రీంకోర్టు కూడా యూసీసీని అమలు చేయాలని కోరింది. కానీ ఈ విషయంలో ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి’’ అని ఆయన మండిపడ్డారు.
మంగళవారం ఉదయం ఐదు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ భోపాల్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బూత్ కార్యకర్తల కోసం నిర్వహించిన ‘‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘‘ప్రజలకు రెండు వేర్వేరు నియమాలు ఉంటే కుటుంబం పనిచేస్తుందా? అలాంటప్పుడు దేశం ఎలా నడుస్తుంది? మన రాజ్యాంగం కూడా ప్రజలందరికీ సమాన హక్కులకు హామీ ఇస్తుంది’’ అని అన్నారు.
ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా ఎవరు మాట్లాడినా, దానిని ఎవరు సమర్థించినా ముస్లిం కూతుళ్లకు తీరని అన్యాయం చేసినట్టే అవుతుందని తెలిపారు. ట్రిపుల్ తలాక్ వల్ల ఆడపిల్లల జీవితమే కాకుండా కుటుంబం మొత్తం నాశనమవుతుందని చెప్పారు. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో విడదీయరాని భాగమైతే ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియాలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. గత వారం ఆయన పర్యటించిన ఈజిప్ట్ ను ఉదహరిస్తూ.. 80-90 సంవత్సరాల క్రితం దేశం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిందని అన్నారు. అక్కడి జనాభాలో 90 శాతం సున్నీ ముస్లింలే ఉన్నారని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రధాని అన్నారు. ఏ రాజకీయ పార్టీలు తమను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాయో భారత ముస్లిం సోదర సోదరీమణులు అర్థం చేసుకోవాలన్నారు. బుజ్జగింపు రాజకీయాలు పస్మాండ ముస్లింలతో సహా చాలా మందిని వదిలేశాయని ఆయన అన్నారు. ‘‘పస్మాండా ముస్లింలు రాజకీయాలకు బలైపోయారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొందరు బుజ్జగింపు రాజకీయాలను ఉపయోగిస్తున్నారు. బీజేపీ క్యాడర్ వెళ్లి ముస్లింలకు ఈ విషయాన్ని వివరించాలి. వారు అలాంటి రాజకీయాలకు గురికాకుండా అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు.
మంచి దొంగలు.. జేబులో రూ.20 నోటు మాత్రమే దొరకడంతో దంపతులకే డబ్బులిచ్చి, స్కూటీపై పరారీ.. వీడియో వైరల్
కాగా.. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణలోని 4వ భాగం రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా ఉండటం గమనార్హం. ఇది భారతదేశం అంతటా తన పౌరులకు ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ను అందించడం తప్పనిసరి అని పేర్కొంది.
