దంపతుల వద్ద డబ్బులు నగలు దోచుకుందామని ఇద్దరు దొంగలు ప్రయత్నించారు. కానీ వారి వద్ద రూ.20 మాత్రమే దొరకడంతో ఆ దొంగలే తిరిగే రూ.100 ఇచ్చి పారిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
ఓ చోరీ ప్రయత్నం దాతృత్వంగా మారింది. ఓ జంటను దోచుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు దొంగలు చివరికి వారికే డబ్బులు ఇచ్చి పరారయ్యారు. అవునండీ.. మీరు చదివింది నిజమే.. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని షహదారాలోని ఫర్ష్ బజార్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దొంగలు తుపాకీతో దంపతులను దోచుకునేందుకు ప్రయత్నించి, వారికే డబ్బులు ఇచ్చి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ రికార్డు అయ్యాయి. ఇవి ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
మణిపూర్ కు సాయం చేయాలంటే ముందు మాకు సాయం చేయండి - మహిళలకు ఆర్మీ విజ్ఞప్తి
వివరాలు ఇలా ఉన్నాయి. షహదారాలోని ఫర్ష్ బజార్ లో రాత్రి సమయంలో ఓ జంట నడుచుకుంటూ వెళ్తోంది. ఈ సమయంలో వారి వద్దకు ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పై వచ్చారు. ఈ దంపతుల దగ్గర స్కూటీ ఆపి తుపాకీతో బెదిరించారు. అనంతరం వారిని దోపిడి చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వారిద్దరూ తాగి, తలకు హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు.
చోరీ చేయాలనే ఉద్దేశంతో ఒక దొంగ ఆ వ్యక్తి జేబులను వెతికాడు. కానీ అతడి జేబులో కేవలం రూ.20 నోటు మాత్రమే దొరికింది. దీంతో ఆ దొంగ నిరాశ చెందారు. ఆ దంపతుల వద్దనే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని భావించారో ఏమో తెలియదు కానీ.. ఆ దొంగలే తిరిగి వారికి రూ.100 నోటు ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను జర్నలిస్ట్ రవి జల్హోత్రా ట్విటర్ లో షేర్ చేశారు. ‘‘విపరీతంగా తాగి ఉన్న దొంగలు వచ్చి బాధితులకు డబ్బులు చెల్లించారు. ఎందుకంటే తమ వద్దే డబ్బులు లేవని, తన గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న నగలు కూడా నకిలీవి అని చెప్పడంతో అలా చేశారు’’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు.
కాగా.. ఈ దంపతులకు ఆయుధం చూపిస్తూ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను హర్ష్ రాజ్ పుత్, దేవ్ వర్మలుగా గుర్తించారు. ఓ నిందితుడైన దేవ్ వర్మ నీరజ్ బవానియా గ్యాంగ్ నుంచి ప్రేరణ పొందాడని ‘ఇండియా టీవీ’ నివేదించింది. నేరానికి ఉపయోగించిన పిస్టల్, స్కూటర్ తో పాటు 30 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ షహదారా రోహిత్ మీనా తెలిపారు. వారిపై నాలుగు కేసులు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
