Anti Paper Leak Bill: నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ ఘటన తర్వాత పరీక్షల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
లోక్‌సభలో ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య వాయిస్ ఓట్ ద్వారా లోక్‌సభ ఆమోదం తెలిపింది. పరీక్షలలో అక్రమాలను అరికట్టేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినంగా మార్చేలా ఈ బిల్లులో మార్పులు చేశారు.
ఈ బిల్లుతో ఏం మారుతుంది..?
ఈ సవరణ బిల్లు అమల్లోకి వస్తే పరీక్షలలో ప్రశ్నపత్రాల లీక్, మాస్ కాపీయింగ్, సంఘటిత మోసాలకు పాల్పడేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ బిల్లు ద్వారా.. పేపర్ లీక్ కేసుల దర్యాప్తు రెండు నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 5 ఏళ్ల జైలు శిక్షను 10 ఏళ్లకు పెంచారు. నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సంఘటితంగా పేపర్ లీక్‌కు పాల్పడే ముఠాలపై గరిష్ఠంగా రూ.10 కోట్ల జరిమానా విధించే నిబంధనను ప్రతిపాదించారు. కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మార్పుల ద్వారా పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, నిజాయితీగా పరీక్షలు రాసే విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్తత
బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలో అక్రమాలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు మద్ధతు తెలిపారు. ఆ సందర్భంగా ఓ విద్యార్థితో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ "మూర్ఖులు", "అంధభక్తులు" అనే పదాలను ఉపయోగించడం అధికార పక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. సభలో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.
స్పీకర్ జోక్యం.. ప్రతిపక్షం వాకౌట్
సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బిల్లుపై మాత్రమే చర్చించాలని సభ్యులకు సూచించారు. అయితే అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం కొనసాగడంతో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వాయిస్ ఓట్ ద్వారా బిల్లు ఆమోదం పొందింది.
నీట్ పేపర్ లీక్ తర్వాత కేంద్రం కఠిన నిర్ణయం
ఇటీవల నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. పరీక్షల పారదర్శకతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నిజాయితీగా పరీక్షలు రాసే విద్యార్థులకు అన్యాయం జరగకుండా, పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదే దిశగా ఈ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.


