- Home
- National
- BJP vs Congress : ఇండియాలో రిచ్చెస్ట్ పార్టీ ఏది? కాంగ్రెస్, బిజెపి లలో ఎవరి దగ్గర ఎంత డబ్బుంది?
BJP vs Congress : ఇండియాలో రిచ్చెస్ట్ పార్టీ ఏది? కాంగ్రెస్, బిజెపి లలో ఎవరి దగ్గర ఎంత డబ్బుంది?
భారతదేశంలో రిచ్చెస్ట్ మ్యాన్ ఎవరంటే టక్కున ముఖేష్ అంబానీ పేరు చెబుతాం. అదే రిచ్చెస్ట్ రాజకీయ పార్టీ ఏదంటే బిజెపినా, కాంగ్రెస్సా అని కన్ఫ్యూజన్ లో పడతాం. మరి ఈ రెండింట్లో ధనిక పార్టీ ఏదో తెలుసా?

బీజేపీ vs కాంగ్రెస్
శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ కాంగ్రెస్… అర్థశతాబ్దానికి చేరువలో ఉన్న పార్టీ బిజెపి. ఈ రెండు పార్టీలే భారత రాజకీయాలను శాసిస్తున్నాయి. స్వాతంత్య్రం తర్వాత అత్యధికకాలం దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్… వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ సర్కార్ ను ఏర్పాటుచేసింది బిజెపి. ఇలా రెండు పార్టీలు ఘనమైన చరిత్ర కలిగివున్నాయి. మరి సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన, పాలిస్తున్న రెండింట్లో రిచ్చెస్ట్ పార్టీ ఏది? అత్యధికంగా డబ్బులు ఎవరివద్ద ఉన్నాయి?
ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ రిపోర్టులు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత సంపన్న రాజకీయ పార్టీ. కాంగ్రెస్‌తో పోలిస్తే బిజేపీ దగ్గర నగదు నిల్వలు, వార్షిక ఆదాయం, మొత్తం ఆస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఆర్థిక బలాబలాల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత?
పలు రిపోర్టుల ప్రకారం… అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6000-7000 కోట్ల వరకు ఉంటుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం రూ.133.97 కోట్లు మాత్రమే. అంటే వందేళ్ల చరిత్రగల కాంగ్రెస్ కంటే 46 ఏళ్ల వయసుగల బిజేపి వద్దే నగదు నిల్వలు ఎక్కువ… దాదాపు 75 రెట్లు ఎక్కువ. ఈ పార్టీల ఆదాయం, ఆస్తిపాస్తుల లెక్కల కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది.
కాంగ్రెస్ కన్నా బీజేపీ సంపాదనే ఎక్కువ
లోక్‌సభ ఎన్నికలు జరిగిన గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో బిజేపి మొత్తం రూ.6,769.14 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇది దేశంలోని ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 85.03%. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బీజేపీ ఆదాయం 56% పెరిగింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ రూ.918.28 కోట్లు (11.53%) ఆదాయం ప్రకటించింది. దీని ఆదాయం 25% తగ్గింది. జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో బిజేపీ టాప్‌లో ఉంటే, కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉంది.
బిజెపి, కాంగ్రెస్ లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
బిజెపికి ప్రధానంగా కంపెనీలు, వ్యాపారవేత్తల నుండి స్వచ్ఛంద విరాళాల ద్వారా భారీ ఆదాయం వస్తుంది. రిపోర్టుల ప్రకారం ఈ పార్టీ మొత్తం ఆదాయంలో రూ.6,124.85 కోట్లు (90.4%) స్వచ్ఛంద విరాళాల నుంచే వచ్చాయి. మిగిలిన రూ.634 కోట్లు (9.3%) బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో సమకూరింది.
కాంగ్రెస్ పార్టీకి కూడా కంపెనీలు, వ్యక్తుల నుంచి విరాళాలు వస్తాయి. కానీ ఈ ఆదాయం చాలా తక్కువ. పార్టీ ఆదాయంలో రూ.522.13 కోట్లు (56.8%) స్వచ్ఛంద విరాళాల ద్వారా వచ్చినట్లు కాంగ్రెస్ రిపోర్ట్ చేసింది. మరో ముఖ్యమైన భాగం అంటే రూ.350.12 కోట్లు కూపన్ల అమ్మకం, ప్రజా విరాళాల సేకరణ ద్వారా వచ్చింది.
కాంగ్రెస్ విరాళాల కన్నా బీజేపీ వడ్డీయే ఎక్కువా!
బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన తేడా ఏంటంటే.. ఆర్థిక నిల్వల నుంచి వచ్చే ఆదాయం. బీజేపీకి భారీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటంతో ఏడాదికి వడ్డీ రూపంలోనే రూ.634 కోట్లు సంపాదించింది. ఈ వడ్డీ ఆదాయం కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛంద విరాళాల ద్వారా వచ్చిన రూ.522.13 కోట్ల కన్నా ఎక్కువ.
పరిపాలనా ఖర్చుల కోసం ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది?
పార్టీ ఆఫీసులు, సిబ్బంది జీతాలు వంటి పరిపాలనా ఖర్చుల కోసం బీజేపీ రూ.323.05 కోట్లు ఖర్చు చేసింది. ఇదే కేటగిరీలో కాంగ్రెస్ రూ.159.68 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది. పార్టీలు ప్రకటించిన ఆస్తులలో ఆఫీస్ భవనాలు, భూమి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులు ఉన్నాయి. బీజేపీ మొత్తం ఆస్తులు రూ.12,171.17 కోట్లు కాగా, అప్పులు కేవలం రూ.15.43 లక్షలు మాత్రమే అని ప్రకటించింది. ఆస్తులతో పోలిస్తే ఇది చాలా తక్కువ అప్పు. కాంగ్రెస్ పార్టీ సుమారు రూ.1,351 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించింది. ఇందులో పార్టీ ఆస్తులు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక ఆస్తులు ఉన్నాయి.
ఆడిట్ రిపోర్టుల ప్రకారం నగదు నిల్వలు, వార్షిక ఆదాయం, ప్రచార ఖర్చులు, మొత్తం ఆస్తుల విషయంలో బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్ కంటే చాలా బలంగా ఉంది. బీజేపీ ప్రధానంగా స్వచ్ఛంద విరాళాలు, పెట్టుబడులపై ఆధారపడగా, కాంగ్రెస్ విరాళాలతో పాటు ప్రజా సేకరణ, కూపన్ల అమ్మకాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది.

