మనం జాలీగా విన్న ‘అమృతం’ పాటలో ఇంత అర్థముందా.? ఆలోచనను మార్చే జీవిత సత్యాలు
Amrutham Song: ఒక మంచి పాట కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వదు.. జీవితాన్ని చూసే కోణాన్ని కూడా మార్చగలదు. అలాంటి పాటల్లో ‘అమృతం’ సీరియల్ టైటిల్ సాంగ్ ఒకటి. ఈ పాట విన్న ప్రతిసారి జీవితంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను నవ్వుతూ ఎదుర్కోవాలని గుర్తు చేస్తుంది.

తెలుగు టెలివిజన్ చరిత్రలో ‘అమృతం’ ఒక ప్రత్యేక అధ్యాయం
90వ దశకంలో పుట్టిన వారికైతే ఈ పాట ఒక జ్ఞాపకం మాత్రమే కాదు.. చిన్ననాటి సాయంత్రాల్ని గుర్తు చేసే ఓ మధురానుభూతి. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోల్లో ఈ పాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కాలం మారినా, ఈ పాటలోని భావం మాత్రం ఎప్పటికీ పాతగా మారలేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సీరియల్లలో ‘అమృతం’ ముందువరుసలో ఉంటుంది. ఈ సీరియల్‌కు గంగరాజు గుణ్ణం కాన్సెప్ట్ రూపొందించడంతో పాటు రచన, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ జస్ట్ ఎల్లో బ్యానర్‌పై ఈ సీరియల్ రూపొందింది.
అచ్చ తెలుగు హాస్యాన్ని, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలతో కలిపి ప్రేక్షకులకు అందించడం ఈ సీరియల్ ప్రత్యేకత. అసభ్యతకు, డబుల్ మీనింగ్ సంభాషణలకు తావివ్వకుండా పరిశుభ్రమైన హాస్యాన్ని అందించగలిగింది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ సీరియల్‌ను ఆదరించారు. అప్పట్లో టీఆర్‌పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడానికి ఇదే ప్రధాన కారణం.
ఈ సీరియల్ మరో విశేషం ఏమిటంటే.. అనేక మంది దర్శకులకు ఇది ఒక ప్లాట్ ఫామ్ గా నిలిచింది. మొత్తం 11 మంది దర్శకులు ఈ సీరియల్ ద్వారా పరిచయమయ్యారు. వారిలో చంద్రశేఖర్ యేలేటి తర్వాత ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి 30 ఎపిసోడ్లకు ఎస్.ఎస్. కంచి దర్శకత్వం వహించగా, అమృతం పాత్రలో నటించిన హర్షవర్ధన్, సర్వం పాత్రలో కనిపించిన వాసు ఇంటూరి కూడా కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు.
చిన్న కష్టాలను పెద్దవిగా భావించొద్దని చెప్పిన అద్భుతమైన పాట
"మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు.. ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు" అనే లైన్ ఈ పాటలోని గొప్ప సందేశాన్ని తెలియజేస్తుంది. మన జీవితానికి యజమానులు మనమే. ప్రతి చిన్న సమస్యను చూసి బాధపడటానికి బదులుగా, మన ఆలోచనలను మార్చుకుంటే జీవితం కూడా మారుతుందనే భావాన్ని ఎంతో సరదాగా చెప్పింది.
"వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు.. అయడిన్‌తో అయిపోయే గాయాలే మనకు గండాలు" అనే పంక్తులు జీవితంలోని చాలా సమస్యలు తాత్కాలికమేనని గుర్తు చేస్తాయి. అప్పట్లో అవి పెద్దవిగా అనిపించినా, కొంతకాలం తర్వాత అవి చిన్న సంఘటనలుగానే మిగిలిపోతాయని ఈ పాట చెబుతుంది.
నవ్వుతూ సమస్యలను ఎదుర్కోవడమే నిజమైన విజయం
"హలో హౌ డుయూ డూ అని అంటోంది అంతే మీ లెవెలు" అనే లైన్ ఎంతో చమత్కారంగా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా, చిరునవ్వుతో స్వాగతించాలనే ఆలోచనను ఇందులో చెప్పేశారు. "గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు.. కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు" అనే పంక్తులు కూడా మన జీవితంలో ప్రతి సమస్యను విపత్తుగా ఊహించుకోవద్దని సూచిస్తాయి. మనం అనుకునేంత పెద్ద కష్టాలు చాలా సందర్భాల్లో ఉండవు. మన భయాలే వాటిని పెద్దవిగా చూపిస్తాయని ఈ పాట చక్కగా వివరిస్తుంది.
నేటి యువతకూ స్ఫూర్తినిచ్చే జీవిత పాఠాలు
"మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు" అనే లైన్ జీవిత తత్వాన్ని ఎంతో సులభంగా వివరిస్తుంది. జీవితం చాలా పెద్దది. అందులో మనం ఎదుర్కొనే కష్టాలు మాత్రం చిన్నవే. వాటిని చూసి నిరాశ చెందకుండా ముందుకు సాగాలని ఈ పాట ప్రోత్సహిస్తుంది. "కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు.. కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్లు.. నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్" వంటి పంక్తులు రోజువారీ జీవితంలోని చిన్న చిన్న ఇబ్బందులను హాస్యంగా చూపిస్తూ, వాటి కోసం అతిగా ఆందోళన చెందొద్దని చెబుతాయి.
చివరగా "భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్" అనే సందేశం నేటి తరానికి కూడా ఎంతో అవసరం. ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు... ఏవైనా సరే, వాటిని జీవితాంతం వెంటాడే భారంగా కాకుండా తాత్కాలిక సవాళ్లుగా చూడాలని ఈ పాట నేర్పుతుంది.

