రైల్వే స్టేషన్లలో లోకో పైలట్లు రింగ్ ఎందుకు మార్చుకుంటారు.? దీని ఉపయోగం ఏంటో తెలుసా?
Indian Railways: భారతీయ రైల్వేలో పాతకాలం నుంచి కనిపించే ఆసక్తికరమైన వ్యవస్థల్లో టోకెన్ ఎక్స్ఛేంజ్ సిస్టమ్ ఒకటి. కొన్ని స్టేషన్లలో లోకో పైలట్ వెదురు రింగ్‌ను (బాంబూ రింగ్) తీసుకోవడం లేదా ఇవ్వడం చాలా మంది చూసే ఉంటారు. అయితే దీని ఉపయోగం ఏంటో తెలుసా.?

టోకెన్ ఎక్స్ఛేంజ్ సిస్టమ్ అంటే ఏంటి?
ఒకప్పుడు దేశంలోని అనేక రైల్వే మార్గాలు సింగిల్ ట్రాక్‌గా ఉండేవి. అంటే ఒకే ట్రాక్‌పై రెండు దిశల్లో రైళ్లు ప్రయాణించాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఒకే సమయంలో రెండు రైళ్లు ఎదురెదురుగా రాకుండా నియంత్రించడానికి టోకెన్ ఎక్స్ఛేంజ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ప్రతి రెండు స్టేషన్ల మధ్య ఉండే ట్రాక్ భాగాన్ని బ్లాక్ సెక్షన్ అని పిలుస్తారు. ఒక బ్లాక్ సెక్షన్‌లో ఒకేసారి ఒక రైలు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఆ అనుమతికి గుర్తుగా ప్రత్యేకమైన స్టీల్ టోకెన్‌ను లోకో పైలట్‌కు అందిస్తారు. టోకెన్ చేతిలో ఉన్న రైలుకే ఆ మార్గంలో వెళ్లే అధికారం ఉంటుంది.
బాంబూ రింగ్ ఎందుకు ఉపయోగిస్తారు?
టోకెన్ చిన్న స్టీల్ బంతి ఆకారంలో ఉంటుంది. దాన్ని నేరుగా లోకో పైలట్‌కు ఇవ్వడం సులభం కాదు. ఎందుకంటే లోకోమోటివ్ ఎత్తుగా ఉంటుంది. అందుకే ఆ టోకెన్‌ను ఒక చిన్న సంచిలో ఉంచి, దానిని వెదురుతో తయారుచేసిన పెద్ద రింగ్‌కు కట్టేవారు. రైలు స్టేషన్‌లోకి వచ్చినప్పుడు రైల్వే సిబ్బంది ఆ రింగ్‌ను లోకో పైలట్‌కు అందిస్తారు. అలాగే, ముందు స్టేషన్ నుంచి తీసుకొచ్చిన టోకెన్ ఉన్న రింగ్‌ను లోకో పైలట్ తిరిగి స్టేషన్ సిబ్బందికి ఇస్తారు. ఈ ప్రక్రియనే టోకెన్ ఎక్స్ఛేంజ్ అంటారు.
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఉదాహరణకు రెండు స్టేషన్లు ఉన్నాయని అనుకుందాం. మొదటి స్టేషన్ నుంచి బయలుదేరే ముందు స్టేషన్ మాస్టర్ ప్రత్యేక యంత్రం ద్వారా ఒక టోకెన్ తీసి లోకో పైలట్‌కు ఇస్తారు. ఆ టోకెన్ ఉన్నంత వరకు ఆ రెండు స్టేషన్ల మధ్య ట్రాక్‌పై మరో రైలుకు అనుమతి ఉండదు.రైలు రెండో స్టేషన్‌కు చేరుకున్న తర్వాత లోకో పైలట్ ఆ టోకెన్‌ను అక్కడి స్టేషన్ మాస్టర్‌కు అప్పగిస్తాడు. అనంతరం ఆ టోకెన్‌ను ప్రత్యేక టోకెన్ యంత్రంలో ఉంచుతారు. దీంతో మొదటి స్టేషన్ నుంచి మరో రైలుకు కొత్త టోకెన్ జారీ చేసే అవకాశం కలుగుతుంది. ఇలా ఒకే ట్రాక్‌పై ఒకేసారి ఒక్క రైలు మాత్రమే ప్రయాణించేలా ఈ వ్యవస్థ భద్రతను కల్పిస్తుంది.
ఆగకుండా వెళ్లే రైళ్లకు రింగ్ ఎలా ఇస్తారు?
కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్‌లో ఆగకుండా వేగంగా వెళ్తాయి. అలాంటి సందర్భాల్లో రైలును ఆపి టోకెన్ ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే వెదురు రింగ్‌ను సిగ్నల్ స్తంభానికి ప్రత్యేకంగా వేలాడదీసేవారు. రైలు స్టేషన్ దాటే సమయంలో లోకో పైలట్ ఆ రింగ్‌ను చేతితో అందుకునేవారు. అదే సమయంలో తన వద్ద ఉన్న పాత టోకెన్ రింగ్‌ను స్టేషన్ సిబ్బందికి అందించేవారు. ఒకవేళ లోకో పైలట్ రింగ్‌ను అందుకోలేకపోతే, స్టేషన్ మాస్టర్ ఎర్ర జెండా చూపించి రైలును ఆపే ఏర్పాట్లు చేసేవారు. ఆ తర్వాత లోకో పైలట్ తిరిగి వచ్చి టోకెన్ తీసుకుని ప్రయాణాన్ని కొనసాగించేవారు.
ఇప్పుడు ఈ విధానం ఎందుకు కనిపించడం లేదు?
ప్రస్తుతం భారతీయ రైల్వేలో చాలా మార్గాలు డబుల్ లేదా మల్టిపుల్ ట్రాక్‌లుగా మారాయి. అలాగే ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో టోకెన్ ఎక్స్ఛేంజ్ విధానం అవసరం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాత సింగిల్ లైన్ మార్గాల్లో ఈ విధానం పరిమితంగా కనిపించే అవకాశం ఉంది. ఈ టోకెన్ ఎక్స్ఛేంజ్ సిస్టమ్ భారతీయ రైల్వే భద్రతా చరిత్రలో కీలకమైన అధ్యాయంగా నిలిచింది. ఆధునిక సాంకేతికత రాకముందు, ఒకే ట్రాక్‌పై రైళ్లను సురక్షితంగా నడిపించడంలో ఈ వ్యవస్థ అత్యంత కీలక పాత్ర పోషించింది.

