ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిపై నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అదే ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలిపై నలుగురు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు.

ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 30 ఏళ్ల యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు స్థానిక కోర్టులో కేసు వేసింది.

Also Read:సీఎం వచ్చే వరకు అంత్యక్రియలు చేయం: ఉన్నావో రేప్ విక్టిమ్ సోదరి

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నలుగురు నిందితులు బుధవారం రాత్రి ఆమె ఇంట్లోకి దూసుకెళ్లి బాధితురాలిపై యాసిడ్ పోశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు మీరట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన 23 ఏళ్ల యువతిపై గత డిసెంబర్‌లో అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేశారు.

Also Read:ఎంతపెద్దవారైనా సరే.. ఎవ్వరినీ విడిచిపెట్టం: యూపీ సీఎం యోగి

నవంబర్‌ 30న ఇద్దరు నిందితులు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితులు... చంపేందుకు కుట్ర చేశారు. కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లిన ఆమెను దారిలోనే అడ్డుకున్నారు. అంతా చూస్తుండగానే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించారు. 

బాధితురాలు కేకలు వేస్తూ కిలోమీటరు మేర పరుగులు తీసింది. అయినా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. బాధితురాలే కాలిన గాయాలతో స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. లక్నో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఉన్నావ్ బాధితురాలు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. తనపై దాడి చేసిన వాళ్ల వివరాలను తెలిపింది. 

Also Read:వారికో న్యాయం... మాకో న్యాయమా? ఉన్నావ్ బాధితురాలి తండ్రి సూటి ప్రశ్న

తనపై అత్యాచారం చేసిన ఇద్దరు సహా మొత్తం ఐదుగురు తనపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారని తెలిపింది. మరోవైపు నిందితులకు ఉరిశిక్షపడాలన్నది తన చివరి కోరికంటూ నిన్న ఉదయం తన తల్లిదండ్రులకు ఆమె చెప్పడం గమనార్హం. అది నెరవేరకుండానే కన్నుమూయడం బాధాకరం.