ఉన్నావో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే వరకు తన సోదరి మృతదేహానికి అంత్యక్రియలు చేసేది లేదని ఉన్నావో అత్యాచార బాధితురాలి సోదరి తెగేసి చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ తమ వద్దకు వచ్చి తక్షణ నిర్ణయం ప్రకటించాలని ఆమె ఆదివారం డిమాండ్ చేశారు. 

యోగి ఆదిత్యనాథ్ తో తాను నేరుగా మాట్లాడదలుచుకున్నట్లు ఆమె తెలిపారు. తనకు ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని, నిందితులకు ఉరిశిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేశారు. సజీవ దహనమైన ఉన్నావో అత్యాచార బాధితురాలి శవాన్ని ఆదివారం గ్రామానికి తరలించారు. 

గురువారం కోర్టు విచారణకు వెళ్తుండగా ఉన్నావో అత్యాచార బాధితురాలికి దుండగులు నిప్పు అంటించారు. తీవ్రమైన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. 

లక్నోలోని ఎస్ఎంసి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం బాధితురాలి ఢిల్లీ సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అత్యాచారం కేసులోని ఐదుగురు నిందితులు బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారని పోలీసులు చెబుతున్నారు.