భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరుకున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఇటలీకి చెందిన ఓ పర్యాటకుడి భార్యకు కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.

వైరస్ లక్షణాలున్న ఆరుగురిని వేర్వేరు ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. వారి రక్త నమూనాలను సేకరించి వాటిని పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.

Also Read:కరోనావైరస్ ఎఫెక్ట్: నాలుగు దేశాలవారికి జారీ చేసిన వీసాలు రద్దు

వీరంతా ఇటలీ, దుబాయ్ నుంచి వచ్చిన పర్యాటకులుగా అధికారులు గుర్తించారు. భారత్‌లోని పర్యాటక కేంద్రాలను సందర్శించడానికి ఇటలీ నుంచి 25 మంది జైపూర్‌కు వచ్చారు. అక్కడి నుంచి తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు గాను ఆగ్రాలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. వారిలో ముగ్గురు అనారోగ్యానికి గురయ్యారు..

వీరిని పరీక్షించగా కరోనా లక్షణాలు కనిపించాయి. వీరితో పాటు లక్నోకు చెందిన మరో వ్యక్తిలో కూడా వైరస్ లక్షణాలు కనిపించడంతో నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇటలీకి వెళ్లి వచ్చిన వారిలో ఇద్దరికి, దుబాయ్ నుంచి అయోధ్య జిల్లాకు తిరిగొచ్చిన మరోకరికి కూడా వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. 

అటు భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

Also Read:ఇండియాలో కరోనా: భారతీయులకు మోడీ చిన్న చిన్న జాగ్రత్తలు

కోవిడ్-19పై మోడీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి వివరాలు తీసుకున్న ఆయన.. కరోనాను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వివిధ దేశాల నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, అనుమానితులకు దూరంగా ఉండాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడం తగ్గించాలని నరేంద్రమోడీ సూచించారు.