న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు కరోనావైరస్ కేసులు బయటపడిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాలుగు దేశాలవారికి జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. మార్చి 3వ తేదీన, అంతకు ముందు జారీచేసిన వీసాలను సస్పెండ్ చేసింది. ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు చెందినవారికి జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. 

జపాన్, దక్షిణ కోరియా దేశాలకు చెందినవారికి మార్చి 3వ తేదీన జారీ చేసిన వీసా ఆన్ అరైవల్స్ ను కూడా సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు భారతదేశంలోకి అడుగు పెట్టనివారికి అది వర్తిస్తుంది. అనివార్యమైన కారణాల వల్ల భారత్ కు రావాల్సినవారు తాజా వీసాల కోసం సమీపంలోని భారత ఎంబసీ లేదా కాన్సులేట్ ను సంప్రదించాలని ఆరోగ్య శాఖ విడుదల చేసిన అడ్వైజరీలో తెలిపారు. 

Also Read: కరోనావైరస్ ఎఫెక్ట్: ఇంగ్లాండు క్రికెటర్ల సంచలన నిర్ణయం

కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త ట్రావెల్ అడ్వైజరీని మంగళవారం విడుదల చేసింది. చైనా దేశస్తులకు ఫిబ్రవరి 5న, దానికి ముందు జారీ చేసిన రెగ్యులర్ (స్టిక్కర్) వీసా/ఈవీసాలను ఇది వరకే రద్దు చేసింది. అది అమలులో ఉంటుంది. 

విదేశీ విమానాల ద్వారా భారత్ కు చేరినవెంటనే సెఫ్ల్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఫోన్ నెంబర్, భారత్ లోని చిరునామా వంటి అన్ని వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుందని తెలిపింది. విదేశీయులు గానీ భారతీయులు గానీ నేరుగా లేదా పరోక్షంగా చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, ఇటలీ, హాంగ్ కాంగ్, మాకువా, వియత్నాం, మలేసియా, ఇండోనేషియా, నేపాల్, థాయ్ లాండ్, సింగపూర్, తైవాన్ లనుంచి వచ్చినప్పుడు తప్పనిసరిగా పోర్ట్ ఎంట్రీలో మెడికల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించింది. 

Also Read: ఆ ప్రచారం నమ్మొద్దు.. కరోనా వైరస్ ఇలా వ్యాపిస్తుంది: మంత్రి ఈటల

చైనా, ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని భారతీయులకు సూచించింది. ఆరుగురు వ్యక్తులు మంగళవారంనాడు హై వైరల్ లోడ్ తో వచ్చారని, వారికి ఆగ్రాలో పరీక్షలు నిర్వహించారని, వారిని ఐసోలేషన్ లో పెట్టామని ఆరోగ్య శాఖ తెలిపింది.