భారతదేశంలో సోమవారం రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కోవిడ్-19పై మోడీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి వివరాలు తీసుకున్న ఆయన.. కరోనాను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read:హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వైరస్: నిర్ధారించిన అధికారులు

వివిధ దేశాల నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, అనుమానితులకు దూరంగా ఉండాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడం తగ్గించాలని నరేంద్రమోడీ సూచించారు. 

ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి. మరో కేసులో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా జాడ కనిపించింది. ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పరిస్ధితిని సమీక్షిస్తోంది. 

Also Read:కరోనా వైరస్ కు మందు పేడ, గోమూత్రం: అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే

కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలోతెలంగాణ సర్కార్ అప్రమత్తమయ్యింది. మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

ఎయిర్‌పోర్టులు, హార్బర్లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉన్నామని హర్షవర్థన్ వెల్లడించారు. ఇప్పటి వరకు భారతదేశంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రజలు ఇరాన్ పర్యటనలు రద్దు చేసుకుంటే మంచిదని కేంద్ర మంత్రి సూచించారు.