బెంగళూరు: కర్ణాటకలోని చిక్ మగళూరులో గల గుబ్బి గద్దెలోని అమూల్య ఇంటిని నిరసనకారులు శుక్రవారం ఉదయం ధ్వంసం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడంతో అమూల్యపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొంత మంది ఆమె ఇంటిపై గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దాడి చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించారు. 

 

అమూల్య తండ్రి ఓస్వాల్డ్ నరోన్హా చిన్నపాటి జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు. అమూల్య ప్రవర్తనను ఆయన ఖండించారు. అమూల్య బెంగళూర్ లో జర్నలిజం విద్యార్థిని. ఆమె వేదికపై నుంచి మూడు సార్లు పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆమె హిందూస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయాలని అనుకుందని, అయితే ఈలోగా ఆమె నుంచి మైక్ ను లాగేశారని అంటున్నారు. 

Also Read: పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు: అమూల్యను ఆపేసిన అసదుద్దీన్ ఓవైసీ (వీడియో)

అమూల్య చర్యను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ ఖండించారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఏఏ వ్యతిరేక సభలో ద్రోహులున్నారని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ అన్నారు. దాన్ని బట్టి సీఏఏ వ్యతిరేకం నిరసన కారణం స్పష్టమవుతోందని ఆయన అన్నారు. అమూల్య నినాదాలకు వ్యతిరేకంగా శ్రీరామ్ సేన, హిందూ జనజాగృతి సమితి సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. 

 

భావప్రకటన స్వేచ్ఛ ముఖ్యమైందేనని, అదే సమయంలో దేశ ద్రోహ ప్రసంగాలను బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అటువంటి శక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గురువారంనాటి ఘటనకు నిరసన తెలుపుతున్న హిందూ జాగరణ్ వేదిక ఆందోళనలో దళిత్ ముక్త్, కాశ్మీర్ ముక్త్, ముస్లిం ముక్త్ నినాదాలు రాసిన ప్లకార్డును ఓ యువతి ప్రదర్శించిందని, గుంపు నుంచి ఆమెను రక్షించామని, ఆమెను కస్టడీలోకి తీసుకున్నామని, ఆమెను ఆరుద్రగా గుర్తించామని బెంగళూర్ పోలీసు కమిషనర్ భాస్కర్ రావు చెప్పారు.

Also Read: ఆమెను జైల్లో పెట్టినా, ఆమె కాళ్లు విరగ్గొట్టినా ఫరవాలేదు: అమూల్య తండ్రి