సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాల ఫోటోలతో ఇతర కీలక సమాచారం శత్రుదేశం పాకిస్థాన్ కు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్న ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

India Pakistan : భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్నాయి.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఇరుదేశాల మధ్య ఉంది. ఇలాంటి సమయంలో దేశద్రోహానికి పాల్పడుతున్న ఇద్దరు దుండగులు పంజాబ్ లో పోలీసులకు చిక్కారు. భారత భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అమృత్‌సర్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసారు. 

అమృత్‌సర్‌ లోని సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాల ఫోటోలు, ఇతర భద్రతాపరమైన సమాచారం లీక్ చేసినందుకు ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. అరెస్టయిన వారిని పలక్ షేర్ మసిహ్, సూరజ్ మసిహ్ గా గుర్తించారు.

ప్రాథమిక దర్యాప్తులో పాకిస్తాన్ గూఢచర్య సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అమృత్‌సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు ద్వారా వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని డీజీపీ తెలిపారు. వీరి నుండి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు. 

ఇదిలావుంటే గత గురువారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) పంజాబ్‌లో రెండు పాకిస్థాన్ డ్రోన్‌లను స్వాధీనం చేసుకుంది. అలాగే తాజాగా ఓ పాక్ ఆర్మీ రేంజర్ ను కూడా భారత భూభాగంలో గుర్తంచి అదుపులోకి తీసుకున్నారు. 

Scroll to load tweet…

భారత్ అదుపులో పాక్ జవాన్ :

భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి మరీ దాడులకు యత్నిస్తోంది పాక్ ఆర్మీ. తాజాగా భారత సరిహద్దులోకి చొరబడ్డ పాక్ రేంజర్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. నిన్న శనివారం బీఎస్ఎఫ్ రాజస్థాన్ సరిహద్దులో ఒక పాకిస్తాన్ రేంజర్ ని అరెస్ట్ చేసింది. అతడు భారత భూభాగంలోకి ఎందుకు వచ్చాడు? ఏదయినా కుట్రకు ప్లాన్ చేసారా? అన్నది తెలుసుకునేందుకు భారత ఆర్మీ పట్టుబడిన పాక్ జవాన్ ను విచారిస్తోంది. 

ఇదిలావుంటే పహల్గాం ఉద్రిక్తతల వేళ బీఎస్ఎఫ్ జవాను అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఆ దేశ ఆర్మీకి చిక్కాడు. అతడిని విడిపించేందుకు భారత ఆర్మీ ప్రయత్నిస్తోంది.. కానీ పాక్ విడుదలకు అంగీకరించడంలేదు. ఇలాంటి సమయంలో పాక్ జవాన్ భారత ఆర్మీకి చిక్కడంతో మన సైనికుడి విడుదల ఈజీ కానుంది.