Amit Shah: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేయగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఎదురుదాడికి దిగారు.

రాహుల్ గాంధీపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు

ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉంటే రాహుల్ గాంధీ జీవితాంతం మాక్ పార్లమెంటులోనే ఉండిపోవాల్సి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్వహించిన సభపై విమర్శలు గుప్పించారు. 1984లో సిక్కులపై జరిగిన హింసాకాండకు సంబంధించిన రోజునే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం బాధితుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా.. అబద్ధాలు ప్రచారం చేయడం, అశాంతిని ప్రోత్సహించడం, పార్లమెంటు కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం ప్రతిపక్షాల రాజకీయ విధానంగా మారిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, ప్రజల తీర్పునకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. విపక్షాలు రాజకీయ గందరగోళానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రస్తావన

1984 నవంబర్ 1న దేశవ్యాప్తంగా సిక్కులపై జరిగిన దాడులను అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ హింసాకాండలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ, రాజకీయ ప్రేరేపిత అల్లర్లలో ఇదొక తీవ్రమైన ఘటనగా అభివర్ణించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి అల్లర్లకు సంబంధించిన కేసులను తిరిగి విచారించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించామని, ఘటనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకుని కొందరిని జైలుకు పంపినట్లు అమిత్ షా వెల్లడించారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ నిర్వహించిన 'చలో ఢిల్లీ' సభపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శలు చేశారు. ఈ కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నమని ఆరోపించారు. పండగల సమయంలో వ్యాపారులు, దుకాణదారులకు ఇబ్బందులు కలిగించడం, దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం ఈ ర్యాలీ వెనుక ఉన్న ఉద్దేశాలుగా ఆయన పేర్కొన్నారు. భారతదేశం రాజ్యాంగం, ప్రజల నిర్ణయాల ఆధారంగా నడుస్తుందని, అల్లర్లు, రాజకీయ ఉద్రిక్తతలతో పాలన సాగదని స్పష్టం చేశారు.

రాజ్యాంగం, ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ఆరోపణలు

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. తన ప్రసంగం కేవలం ఒక పార్టీకి లేదా నాయకుడికి పరిమితమైనది కాదని, దేశంలోని యువత, మహిళలు, రైతులు, కార్మికుల ఆకాంక్షలకు ప్రతిబింబమని రాహుల్ పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపుల కంటే ప్రతి భారతీయుడి గొంతుకకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో చాలా కాలంగా ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటి ఆధారంగానే 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నారంటూ రాహుల్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేనని అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని కూడా వ్యాఖ్యానించారు.

మోదీ పాలనపై రాహుల్ విమర్శలు

ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లడం లేదంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. తప్పించుకోవాలని ప్రయత్నించినా బాధ్యతల నుంచి తప్పించుకోలేరని అన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పన్నెండేళ్లలో సామాన్య ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు.

దేశంలోని యువతకు తగిన ఉద్యోగాలు లభించడం లేదని, రైతుల ఆదాయం పెరగడం లేదని రాహుల్ విమర్శించారు. కొద్దిమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చడమే కేంద్ర ప్రభుత్వ పాలనా విధానంగా మారిందని ఆరోపించారు. టెలికాం, పోర్టులు, బ్యాంకులు వంటి కీలక రంగాల్లో ఒకే వ్యక్తికి అధిక ప్రయోజనాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి దేశంలోని కీలక ఆర్థిక వ్యవస్థలను కొందరి ప్రయోజనాలకు అనుగుణంగా నడిపిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దేశ సంపద, వ్యవస్థలపై కొద్దిమందికే నియంత్రణ ఉండే విధానాన్ని కాంగ్రెస్ అంగీకరించదని స్పష్టం చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ, ఎన్నికల పారదర్శకత, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపై కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేయగా.. విపక్షాలు ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఇరు పక్షాల పరస్పర విమర్శలతో దేశ రాజకీయాల్లో ఈ అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.