Asianet News TeluguAsianet News Telugu

సీఎం అయ్యాక కూడా వైద్యం చేయడం మానలేదు.. డాక్టర్ బీసీ రాయ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

భారతదేశంలో వైద్యో నారాయణో హరీ అంటారు. ఆపద సమయంలో ప్రాణాలు నిలిపే వైద్యులను.. దేవుళ్లుగా కూడా కొలుస్తారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

All you need to know about Dr Bidhan Chandra Roy and contribution to medical science
Author
First Published Aug 7, 2022, 5:52 PM IST

భారతదేశంలో వైద్యో నారాయణో హరీ అంటారు. ఆపద సమయంలో ప్రాణాలు నిలిపే వైద్యులను.. దేవుళ్లుగా కూడా కొలుస్తారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ప్రాణాలను పణంగా పెట్టి.. ప్రజలకు సేవలు అందించారు. భారత దేశం విషయానికి అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే.. ఇక్కడ వైద్య సదుపాయాలు తక్కువనే చెప్పాలి. ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల పల్లెల్లోకి వైద్యసేవలు అందడం కష్టమే అని చెప్పాలి. అయితే భారతదేశంలో స్వాతంత్య్ర రాక ముందు నుంచి వైద్యసేవలను అభివృద్ది చేసేందుకు ఎందరో కృషి చేస్తూ వచ్చారు. అలాంటి వాటిలో డాక్టర్ బీదాన్ చంద్ర రాయ్ ఒకరు. ఆయన జన్మదినం అయిన జూలై 1వ తేదీనే భారతదేశంలో జాతీయ వైద్య దినోత్సవంగా జరుపుకుంటారు. 

మరి ఆయన భారత వైద్య రంగానికి ఏం చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం.. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్1882 జూలై 1వ తేదీన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మించారు. ఆయన పశ్చిమ బెంగాల్‌కు రెండో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వైద్య రంగానికి చేసిన విశేషమైన కృషికి గాను.. 1961లో ఆయనను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిచింది. అయితే 1962 జూలై 1వ తేదీనే(జన్మించిన తేదీనే) ఆయన మరణించడం జరిగింది. తర్వాత 1991 నుంచి డాక్టర్ బీసీ రాయ్ జన్మించిన జూలై 1వ తేదీని.. జాతీయ వైద్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

బీసీ రాయ్ జన్మించిన ప్రాంతం..  ప్రస్తుతం బిహార్‌లో ఉంది. వారి కుటుంబం.. రాజా రామ్‌మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజంను ఫాలో అయ్యేవారు. గణిత శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. తర్వాత విదేశాలలో విద్యను కొనసాగించారు. తిరిగి స్వదేశానికి చేరుకున్న తర్వాత కలకత్తా మెడికల్ కాలేజీలో బోధించారు. బెంగాల్‌లోనే కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సైన్స్ ఆధారిత వైద్య సంరక్షణను మరింత ముందుకు తీసుకెళ్లడంలో బీసీ రాయ్ అద్భుతమైన సహకారం అందించారు.

జాదవ్‌పూర్ టీబీ హాస్పిటల్, మహిళలు, పిల్లల కోసం చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, విక్టోరియా ఇన్‌స్టిట్యూషన్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో డాక్టర్ బీసీ రాయ్ కీలకపాత్ర పోషించారు. మహిళలకు సామాజిక సేవ, నర్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి ఆయన ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీసీ రాయ్.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ హాస్పిటల్, కోల్‌కతాలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీని స్థాపించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.

కొన్నేళ్ల తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ వైద్య వృత్తిని వీడలేదు. 1933లో మహాత్మాగాంధీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు.. ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ బీసీ రాయ్‌తో మాట్లాడుతూ.. “నేను మీ చికిత్స ఎందుకు తీసుకోవాలి? మీరు నాలుగు వందల మిలియన్ల మంది నా దేశస్థులకు ఉచితంగా చికిత్స చేస్తారా?’’ అని అడిగారు. అందుకు బీసీ రాయ్ స్పందిస్తూ.. ‘‘ లేదు గాంధీజీ.. నేను అందరికీ ఉచితంగా చికిత్స చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ నేను మోహన్‌దాస్ కరంచంద్ గాంధీకి చికిత్స చేయడం లేదు.. నా దేశంలోని నాలుగు వందల మిలియన్ల ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయనకు చికిత్స చేయడానికి వచ్చాను’’ అని చెప్పారు. 

బీసీ రాయ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా, కలకత్తా మేయర్‌గా, కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా కొనసాగారు. కలకత్తా మేయర్‌గా బీసీ రాయ్.. ఉచిత విద్య, ఉచిత వైద్య సహాయం, నగరం యొక్క మెరుగైన పౌర సౌకర్యాలను విస్తరించారు. స్వాతంత్య్రం అనంతరం ఆయనను బెంగాల్ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ భావించింది. కానీ బీపీ రాయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. డాక్టర్‌గా కొనసాగాలనుకున్నారు. పాత్రిక్రేయునిగా ఆయన సేవలు అందించారు. ఆ తర్వాత పెద్దల నిర్ణయంతో.. మనసు మార్చుకని బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ రాయ్ తన చివరి రోజు వరకు వైద్యుడిగాచ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేస్తూనే ఉన్నారు. మరణించడానికి ముందే తన కలకత్తా ఇంటిని నర్సింగ్‌హోమ్ నిర్వహణ కోసం విరాళంగా ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios