ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్‌ సుమిత్‌ చివరి మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. త్వరలోనే ఉద్యోగం మానేసి వచ్చి ఒంటరిగా ఉంటున్న తండ్రిని చూసుకుంటానని ఆయన చెప్పిన మాటలు తలచుకొని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయల్దేరిన ఎయిరిండియా (Air India)బోయింగ్‌ అత్యంత దారుణ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ అత్యంత విషాదకరమైన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు, విమానం కూలిన హాస్టల్ లోని 20 మంది మెడికోలు కూడా చనిపోయారు.ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో కొందరి కథలు, కథనాలు వింటుంటే కన్నీళ్లు ఆగవు. అలాంటిదే విమాన పైలట్‌ కెప్టెన్‌ సుమిత్‌ సబర్వాల్‌ స్టోరీ కూడా. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కెప్టెన్ సుమిత్‌ కి సుదీర్ఘంగా 8,200 గంటల పాటు విమానాలను నడిపిన చరిత్ర ఉంది.

సుమిత్‌ తండ్రి వృద్ధాప్యంతో బాధపడుతున్నారు.తల్లి లేకపోవడంతో తండ్రి ఒంటరిగా ఉంటున్నారు.దీంతో సుమిత్‌ తండ్రి బాగోగులు చూసుకోవడానికి ఉద్యోగం మానేయాలనుకున్నారు.ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)లో పని చేసి.. పదవీవిరమణ పొందారు. అంతేకాకుండా ఆయన ఇద్దరు మేనళ్లుల్లు కూడా పైలట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

నాన్న..ఉద్యోగం మానేసి మిమ్మల్ని చూసుకుంటాను

కొంతకాలం క్రితం తండ్రి వద్దకు వెళ్లిన సుమిత్‌ ‘త్వరలో ఉద్యోగం మానేసి వచ్చి..నిన్ను చూసుకుంటా నాన్నా’ అని తన తండ్రికి మాటిచ్చినట్లు...ఇంతలోనే మృత్యువు ప్రమాదంలో రూపంలో వెంటాడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు సుమిత్‌ తండ్రి ఎవరూ లేక ఒంటరి వారు అయిపోయారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆయన నివాసానికి చేరుకున్న పలువురు అధికారులు, రాజకీయ నేతలు సుమిత్‌ తండ్రిని ఓదార్చారు. కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్‌గా వ్యవహరించిన క్లైవ్‌ కుండర్‌కు కూడా 1,100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన తల్లి ఎయిర్‌ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సిస్టర్‌ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది.

గురువారం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా AI171 ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్‌పోర్టు దగ్గరలో ఉన్న వైద్య కళాశాల హాస్టల్ పై పడటంతో అందులోని ఒకే ఒక్క వ్యక్తి తప్ప మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విమానంలో ఉండే ఫ్లైట్‌ డేటా రికార్డర్, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లను విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.