Agni 5 bunker buster missile: 7,500 కిలోల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌తో అగ్ని-5 రాకెట్ అభివృద్ధి  చేస్తోంది భారత్. దీంతో బంకర్ టార్గెట్లపై ఖచ్చితమైన దాడులు చేసే శక్తిని పొందుతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Agni 5 bunker buster missile: భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (DRDO) ఇప్పుడు అగ్ని-5 కి చెందిన శక్తివంతమైన మిస్సైల్ ను అభివృద్ధి చేస్తోంది. ఇది 7,500 కిలోల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌తో కూడిన, భారీ ధ్వంస శక్తిని కలిగిన కాన్వెన్షనల్ మిస్సైల్. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోని భూగర్భ యుద్ధంలో కీలక ముందడుగుగా చెప్పవచ్చని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

2024 జూన్ 22న అమెరికా B-2 బాంబర్ల నుండి GBU-57/A బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ ఫోర్డో అణు సదుపాయాలపై వదలడంతో జరిగిన దాడి ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ నిపుణులను, రక్షణ రంగ వ్యూహకర్తలను సంభ్రమానికి గురిచేసింది. అదే సమయంలో, భవిష్యత్తులో యుద్ధాలు భూమిపై కాకుండా భూమికి లోపల జరిగే అవకాశాన్ని ఇది హైలైట్ చేసిందని రక్షణ రంగ నిపుణులు గిరీష్ లింగన్న పేర్కొన్నారు.

డీఆర్‌డీఓ వ్యూహాత్మక ప్రణాళిక

ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, డీఆర్‌డీఓ అత్యున్నత స్థాయి టెక్నాలజీతో అగ్ని-5 మిసైల్‌లో 7,500 కిలోల సామర్థ్యంతో బంకర్ బస్టర్ వార్‌హెడ్‌ను అనుసంధానించే పనిని వేగవంతం చేసింది. ఈ మిసైల్ భూగర్భ రహస్య స్థలాలను 80 నుండి 100 మీటర్ల లోతు వరకు చీల్చగలగడం దీని ముఖ్య లక్ష్యంగా ఉంది.

అగ్ని-5 మిసైల్ 17.5 మీటర్ల పొడవుతో, 2 మీటర్ల వెడల్పుతో ఉండగా, భారీ వార్‌హెడ్‌కు తగినట్లు దానిలో నిర్మాణ మార్పులు చేశారు. 50,000 కిలోల బరువు కలిగిన ఈ మిసైల్ మూడు దశల ఘన ఇంధన శక్తితో పనిచేస్తుంది. రింగ్ లేసర్ జైరో, యాక్సిలరోమీటర్లు, ఫ్లెక్స్ సీల్ త్రస్ట్ వెక్టర్ నియంత్రణ ద్వారా అధిక ఖచ్చితమైన టార్గెట్ ను అందుకుంటుంది.

బంకర్ బస్టర్ వార్‌హెడ్ సామర్థ్యం

ఈ 7,500 కిలోల వార్‌హెడ్‌ను, రీఫోర్స్‌డ్ రాళ్ళు, కాంక్రీట్, ఉక్కు వంటి పదార్థాలను తలగొట్టగల ప్రత్యేక ఆకార శక్తితో రూపొందిస్తున్నారు. ఇది 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అమెరికా GBU-57 60 మీటర్ల మట్టిని లేదా 18 మీటర్ల రీఫోర్స్‌డ్ కాంక్రీటును ఛేదించగలదు. వాటితో పోలిస్తే అగ్ని-5 మరింత అధిక దూరం చొచ్చుకుపోగలదని అంచనా.

అగ్ని-5లో బంకర్ బస్టింగ్‌తో పాటు, పైభాగంలో పేలే (ఎయిర్‌బర్స్ట్) విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇది శత్రువుల వైమానిక స్థావరాలు, కమాండ్ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడంలో ఉపయోగపడుతుంది.

అగ్ని5 బంకర్ బస్టర్ మిస్సైల్ పరిధి, వ్యూహాత్మక సామర్థ్యం

న్యూక్లియర్ మిసైల్ రూపంలో అగ్ని-5కు 7,000 కిమీ కంటే అధిక పరిధి ఉన్నా, బంకర్ బస్టర్ రూపంలో ఇది 2,000 నుంచి 2,500 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని అంచనా. ఇది అధిక బరువుతో కూడిన వార్‌హెడ్‌ను మోయడంలో సహాయపడుతుంది.

ఏరోప్లేన్ ద్వారా బంకర్ బస్టర్‌ను పంపడం కంటే మిసైల్ ద్వారా పంపడం భారత్‌కు అనేక ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వాటిలో మొదటిది భారత భూభాగం లోపల నుంచే లాంచ్ చేయగల సామర్థ్యం. రెండోది మ్యాక్ 24 వేగంతో టార్గెట్ ను అందుకుంటుంది. మూడోది రోడ్ మొబైల్ కానిస్టర్ ద్వారా ఎక్కడినుంచైనా లాంచ్ చేయవచ్చు.

ప్రపంచ బంకర్ బస్టర్ ఆయుధాల పోటీ ఎలా ఉంది?

అమెరికా GBU-57, దక్షిణ కొరియా Hyunmoo-IV వంటి వ్యవస్థలకు భారత్ అగ్ని-5 రూపంలో సమాధానం ఇస్తోంది. విమానాల అవసరం లేకుండా మొబైల్ లాంచర్ ద్వారా పంపగలగడం, దీని ప్రధాన ప్రత్యేకత.

ఈ మిసైల్‌కి మద్దతుగా 2024 మార్చిలో జరిగిన మిషన్ దివ్యాస్త్రలో చూపిన MIRV (Multiple Independently Targetable Reentry Vehicle) టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే టెక్నాలజీని ఇప్పుడు ఒక్కటే భారీ వార్‌హెడ్‌ను ఖచ్చితంగా ఉద్దేశించిన టార్గెట్ పై వేయడానికి మార్చారు.

భారతదేశ భద్రతా స్వావలంబనకు ఇది సంకేతంగా నిలుస్తోంది. భూగర్భ మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన దాడుల ద్వారా భారత్ సామాన్య ఆయుధ శక్తిగా కూడా ఎదుగుతోంది.

అగ్ని-5లో ఉపయోగించిన కార్బన్ కాంపోజిట్ కవచం పునఃప్రవేశ సమయంలో తట్టుకునేలా తయారు చేశారు. ఇది రింగ్ లేసర్ జైరోస్కోప్స్, యాక్సిలరోమీటర్లతో కూడిన నావిగేషన్ వ్యవస్థ ద్వారా అధిక ఖచ్చితతను అందిస్తుంది.

అగ్ని-5 మిసైల్‌కి ఇప్పటికే ఉన్న రోడ్-మొబైల్, కానిస్టరైజ్డ్ లాంచ్ విధానం కొనసాగుతుంది. ఇది శత్రువు ట్రాకింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ, వివిధ ప్రాంతాల నుంచి త్వరితంగా ప్రయోగించగల సామర్థ్యాన్ని ఇస్తుంది.

అగ్ని-6 రూపకల్పనలో డీఆర్డీవో

ప్రాథమిక సమాచారం ప్రకారం, DRDO ఇప్పటికే అగ్ని-6 రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇది 12,000 కిమీ పరిధితో 10 MIRV లను ప్రయోగించే లక్ష్యంతో ఉంది.