india republic day: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్.. కళాకారుడు రోహన్ దహోత్రే రూపొందించిన ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. ఈ డూడుల్‌లో సంప్రదాయ దుస్తులు ధరించిన జంతువులు భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
India Republic day 2025: భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా భారత దేశ ప్రజలకు చాలా దేశాలు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ కూడా భారత ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపింది. కళాకారుడు రోహన్ దహోత్రే రూపొందించిన ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ ఈ వేడుకను జరుపుకుంది. ఈ డూడుల్‌లో సంప్రదాయ దుస్తులు ధరించిన జంతువులు భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
పుణే కళాకారుడు రోహన్ దహోత్రే రూపొందించిన ఈ డూడుల్‌లో వన్యప్రాణుల థీమ్‌తో కూడిన పరేడ్‌లో వివిధ జంతువులు కవాతు చేస్తున్నట్లు చూపించారు. సంప్రదాయ లడఖీ దుస్తులు ధరించిన హిమ చిరుత, ధోతీ-కుర్తా ధరించి సంగీత వాయిద్యం పట్టుకున్న పులి, ఎగురుతున్న నెమలిని మీరు చూడవచ్చు. ఈ డూడుల్‌లో ఒక జింక కూడా ఉంది. అది అధికారిక కర్రను పట్టుకుని నడుస్తుంది. దీనితో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రతీకగా ఇతర జంతువులు కూడా ఉన్నాయి.
గూగుల్ వెబ్‌సైట్‌లో ఈ డూడుల్ గురించి సమాచారం అందించారు. ఈ డూడుల్ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుందని, ఇది జాతీయ గౌరవం, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.

రోహన్ దహోత్రే ఈ డూడుల్ గురించి వివరిస్తూ..
రిపబ్లిక్ డే భారతదేశానికి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తుంది. ప్రతి భారతీయుడిలో దేశభక్తి భావాన్ని రేకెత్తిస్తుంది. లెక్కలేనన్ని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఇంకా మరిన్నింటిని కలిగి ఉన్న దాని అద్భుతమైన వైవిధ్యంతో - భారతదేశం దానిలో ఒక శక్తివంతమైన ప్రపంచంలా అనిపిస్తుంది. నేను ఎల్లప్పుడూ Google Doodleని మిలియన్ల మందిని చేరుకునే, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించే వేదికగా మెచ్చుకున్నాను. వ్యక్తిగతంగా, నా దేశానికి అటువంటి అర్థవంతమైన సందర్భానికి సహకరించడం, గణతంత్ర దినోత్సవం వంటి ముఖ్యమైన విషయాన్ని వివరించే అవకాశం లభించడం గొప్ప గౌరవం అని తెలిపారు.

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 31 శకటాలు
గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా కర్తవ్య పథ్‌లో 31 శకటాలు ప్రదర్శిస్తారు. వీటిలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి, 15 కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందినవి ఉన్నాయి. 'స్వర్ణిమ్ భారత్: వారసత్వం, అభివృద్ధి' అనేది థీమ్.
పరేడ్ సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ వ్యవస్థ, ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థ వంటి అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శిస్తారు. సైన్య యుద్ధ నిఘా వ్యవస్థ 'సంజయ్', DRDO 'ప్రళయ' క్షిపణి కూడా మొదటిసారిగా ప్రదర్శించబడతాయి. T-90 'భీష్మ' ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, వాహనంపై అమర్చబడిన పదాతిదళ మోర్టార్ వ్యవస్థ (ఐరావత్) కూడా పరేడ్‌లో భాగంగా ఉంటాయి.
ఫ్లైపాస్ట్‌లో C-130J సూపర్ హెర్క్యులస్, C-17 గ్లోబ్‌మాస్టర్, SU-30 యుద్ధ విమానాలు సహా భారత వైమానిక దళానికి చెందిన 40 విమానాలు పాల్గొంటాయి. భారత తీర రక్షణ దళానికి చెందిన మూడు డోర్నియర్ విమానాలు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయి.
