ఎయిర్ హోస్టెస్ పై ఆమె స్నేహితుడు, అతని ఫ్రెండ్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...అంథేరికి చెందిన యువతి ముంబయిలోని ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా... మంగళవారం రాత్రి ఆమె భోజనానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు స్వప్నిల్ ఆమెను తన రూమ్ కి ఆహ్వానించాడు. స్వప్నిల్ ఓ ఇంట్లో పెయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. అతనితోపాటు పలువురు స్నేహితులు కూడా అక్కడే ఉంటున్నారు.

కాగా.. ఎయిర్ హోస్టెస్ ని భోజనానికి పిలిచిన స్వప్నిల్... ఆమెను మద్యం సేవించాల్సిందిగా ఒత్తిడి చేశాడు. వారి బలవంతం మీద ఆమె మద్యం సేవించింది. ఆ మద్యం మత్తులో స్పృహ కోల్పోయిన యువతిపై స్వప్నిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉదయం ఆమెకు స్పృహ వచ్చి చూసుకునే సరికి తాను అత్యాచారినికి గురైనట్లు ఆమె గుర్తించింది.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మిగితావారి కోసం గాలిస్తున్నారు.