Air India crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక యంగ్ క్రికెటర్ కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా అందరూ చనిపోయారు.

Dirdh Patel: అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 జూన్ 12, 2025న ఎయిర్‌పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ఘోర విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 241 మంది విమానంలోని ప్రయాణికులు కాగా, 33 మంది విమానం కూలిన నివాస ప్రాంతంలో ఉన్నవారు.

ఎయిరిండియా విమాన మృతులలో 23 ఏళ్ల క్రికెటర్ దీర్ధ్ పటేల్

ఈ ఘోర విమాన ప్రమాద మృతులలో 23 ఏళ్ల యంగ్ క్రికెటర్ దీర్ధ్ పటేల్ కూడా ఉన్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన, ఇంగ్లాండ్‌లోని లీడ్స్ మాడర్నియన్స్ క్రికెట్ క్లబ్ తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడారు. 2024 సీజన్‌లో విదేశీ ఆటగాడిగా బరిలోకి దిగిన ఆయన, హడర్స్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, త్వరలోనే టెక్ రంగంలో కెరీర్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

విమానంలో మొత్తం 242 మంది (230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ మెంబర్లు) ఉండగా, విమానం మేగనినగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ మీద కూలిపోవడంతో అక్కడ నివసించే పలువురు డాక్టర్లు, విద్యార్థులు, కుటుంబసభ్యులు కూడా మరణించారు.

ఉన్నత విద్యలో దీర్ధ్ పటేట్ ప్రతిభ

బ్రిటిష్ మీడియా బీబీసీ ప్రకారం.. హడర్స్‌ఫీల్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్ డా. జార్జ్ బార్గియానిస్ మాట్లాడుతూ.. “దీర్ధ్ పటేట్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. చదువులో అత్యుత్తమ మార్కులు సాధించాడు. అతని విషయంలో కేవలం విద్యే కాదు, అతని ఆసక్తి, ప్యాషన్ కూడా మాకు గుర్తుండే అంశాలు” అని అన్నారు.

అలాగే, “దీర్ధ్ పటేల్ తరచూ క్లాస్ ముగిసిన తర్వాత కూడా ప్రశ్నలు అడిగేవాడు. అతని చదువుల విషయంలో నిజంగా లోతైన అవగాహన ఉండేది. రియల్ వరల్డ్‌లో తన విద్యను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకునే ప్రత్యేకత ఉండేది” అని తెలిపారు.

దీర్ధ్ పటేట్ మరణంపై క్రికెట్ క్లబ్, లీగ్ సంఘం తీవ్ర దిగ్భ్రాంతి

లీడ్స్ మాడర్నియన్స్ క్రికెట్ క్లబ్ దీర్ఘ్ పటేల్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. “ఇది మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. అతని కుటుంబానికి, మిత్రులకు మా ప్రగాఢ సానుభూత” అని తెలిపింది. దీర్ధ్ తన కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్లీ క్రికెట్ ఆడాలనే ఆలోచనలో ఉన్నాడు. అతని సోదరుడు కృతిక్ పటేల్ కూడా క్రికెట్ క్లబ్ తరపున ఆడిన విషయాన్ని సంబంధిత వర్గాలు గుర్తుచేశాయి.

ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు

విమానంలో దూర ప్రయాణానికి అవసరమైన భారీ ఇంధనం ఉండటం వలన పేలుడు తీవ్రంగా జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), బోయింగ్ కంపెనీ సహకారంతో పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందని సాక్షులు తెలిపారు.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్ స్వాధీనం

ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు విమాన బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ నందన్ చంద్రశేఖరన్ ప్రతి మృతుని కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఇది భారత విమానయాన చరిత్రలో ఒక ఘోరమైన దుర్ఘటనగా నిలిచింది.