India vs England: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్‌లు రికార్డుల మోత మోగించనున్నారు.
India vs England: ఇంగ్లాండ్ పర్యటన భారత క్రికెట్‌కు ఇది ఓ ప్రత్యేక టూర్‌గా నిలవనుంది. జూన్ నుంచి ఆగస్ట్ 2025 వరకు జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌లో భారత జట్టు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగనుంది. ఇటీవలే స్టార్ సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఇద్దరు స్టార్లు లేకుండా భారత జట్టుకు ఇది తొలి టెస్టు సిరీస్. వీరి స్థానంలో జట్టులోకి యంగ్ ప్లేయర్లు వచ్చారు.
ఇంగ్లాండ్ టూర్ లో శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ రికార్డులు
భారత యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, టెస్ట్ కెరీర్‌లో 2000 పరుగుల మైలురాయికి 107 పరుగుల దూరంలో ఉన్నాడు. 32 టెస్టుల్లో 1,893 పరుగులు చేశాడు. గిల్ బ్యాటింగ్ సగటు 35.05గా ఉంది. 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇంగ్లాండ్ టూర్ లో 2వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. అయితే, ఇంగ్లాండ్ లో గిల్ బ్యాటింగ్ గణాంకాలు గొప్పగా లేవు. 6 ఇన్నింగ్స్‌లో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.
యశస్వి జైస్వాల్ 1,798 పరుగుల చేయగా, 2000 రన్స్‌కు 202 పరుగుల దూరంలో ఉన్నాడు. 19 టెస్టుల్లో జైస్వాల్ సగటు 52.88గా ఉంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై గొప్ప రికార్డు కలిగి ఉన్నాడు. గతేడాది ఇండియాలో జరిగిన సిరీస్‌లో 712 పరుగులతో దుమ్మురేపాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ టూర్ లో జైస్వాల్ పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది.

3000 టెస్టు పరుగులు పూర్తిచేయనున్న రిషబ్ పంత్
టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ 43 టెస్టుల్లో 2948 పరుగులతో 3,000 టెస్ట్ పరుగుల మైలురాయికి కేవలం 52 పరుగుల దూరంలో ఉన్నాడు. అతని బ్యాటింగ్ సగటు 42.11గా ఉంది. 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్ లో రెండు సెంచరీలు సాధించిన పంత్.. తన సహజమైన దూకుడు ఆటతో ఈ సిరీస్ లో కూడా అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
9000 పరుగులకు దగ్గరగా కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ 8565 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. 9,000 పరుగులకు 435 పరుగుల దూరంలో ఉన్నాడు. 215 మ్యాచుల్లో 17 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్‌పై ప్రాక్టీస్ మ్యాచులో 116, 51 పరుగులతో ఆకట్టుకున్న రాహుల్.. ఈ సిరీస్‌ను టర్నింగ్ పాయింట్‌గా మార్చుకోవాలని భావిస్తున్నాడు.

మరో మైలురాయికి చేరువగా జడేజా, సిరాజ్
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 6691 అంతర్జాతీయ పరుగులు చేశాడు. 7,000 పరుగుల మైలురాయికి 309 పరుగుల దూరంలో ఉన్నాడు. 358 మ్యాచుల్లో 4 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు సాధించాడు. గత టూర్‌లో ఇంగ్లాండ్ లో సెంచరీ చేసిన అనుభవంతో జడేజా ఈసారి మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.
పేసర్ మహ్మద్ సిరాజ్, 96 అంతర్జాతీయ మ్యాచుల్లో 185 వికెట్లు తీశాడు. 200 వికెట్ల మైలురాయికి 15 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ లో ఇప్పటివరకు 11 మ్యాచుల్లో 27 వికెట్లు తీసిన సిరాజ్, ఈసారి కూడా కీలకపాత్ర పోషించవచ్చు. భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ జూన్ 20న లీడ్స్‌లో ప్రారంభమవుతుంది.
