కేరళ: ప్రకృతి భీభత్సానికి కేరళ కకావికలమైంది. ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు...వరదల వల్ల తిండిలేక నానా కష్టాలు పడుతున్న మలయాళీలను ఆదుకునేందుకు అంతా ముందుకు వచ్చారు. చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరు హృదయం స్పందించింది. దాతలు వివిధ రూపాలలో సాయం చేస్తూ తమ దాతృత్వం ప్రదర్శించుకున్నారు. 

అయితే దాతల సాయాన్ని ప్రజలకు అందించాల్సిన అధికారులు కక్కుర్తి పడ్డారు. దాతలు పంపించిన సహాయక సామాగ్రిని దొంగిలించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కారు. వయనాడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తోటి అధికారులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. 

దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి...పనమరం గ్రామంలోని సహాయక శిబిరానికి సామాగ్రి వచ్చింది. ఆ సామాగ్రిని శిబిరం నుంచి తమ వాహనంలో తరలించేందుకు థామస్, దినేష్ అనే ఇద్దరు ఉద్యోగులు ప్రయత్నించారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. దగ్గర్లో ఉన్నఓ సీనియర్ ప్రభుత్వ ఉద్యోగికి చెప్పగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని విచారించగా తాము గ్రామంలోని మరో శిబిరానికి ఈ మెటీరియల్ తరలిస్తున్నామంటూ నిందితులు థామస్, దినేశ్‌లు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.  

 నిందితులు ఇద్దరూ గతంలో చెంగన్నూర్‌లో తాత్కాలికంగా పనిచేసిన సమయంలో కూడా బాధితుల సామాగ్రిని చోరీ చేసినట్టు తెలిసింది. అదే చేతివాటాన్ని ఇక్కడ ప్రదర్శించబోయి కటకటాల్లోకి వెళ్లారు. ఓ వైపు వరద బాధితుల కోసం ప్రభుత్వ అధికారులంతా నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే.. కొందరు అధికారులు ఇలా అక్రమాలకు పాల్పడుతుండడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి

కేరళకు కేంద్రం నుంచి రూ.600 కోట్లు: అంచనా తర్వాత మరింత

కేరళకు పళని కౌంటర్: వరదలకు మేం కారణం కాదు