హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో  గురువారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. గురువారం నాడు 17 ఎంపీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది. 

మావోయిస్టలు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు మాత్రమే పోలింగ్ ‌నిలిపివేయనున్నారు. రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మావోల ప్రభావం ఉంటుందని  అధికారులు భావిస్తున్నారు. 

ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

రాష్ట్రంలో 2,97,08,599 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 34,604 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి 2.80 లక్షల మంది సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 17 స్థానాలకు పోటీచేస్తుండగా.. ఎంఐఎం ఒక స్థానంలో, బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2చోట్ల బరిలో పోటీ చేస్తున్నాయి. గుర్తింపుపొందిన ఈ పార్టీల నుంచి మొత్తం 61 మంది పోటీచేస్తుండగా.. రిజిస్టర్ అయిన పార్టీలవారు 83 మంది, స్వతంత్ర అభ్యర్థులు 299 మంది పోటీలో ఉన్నారు.

రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. హైద్రాబాద్‌లో ఎంఐఎం విజయం సాధించనుందని  ఆ పార్టీ విశ్వాసంతో ఉంది. ఎంపీ ఎన్నికల్లో  తమ సత్తాను  చూపాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఇక ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ,  25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారైనా తనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కోరుతున్నారు. ఈ దఫా వైసీపీకి ఏపీలో అధికారం రాకపోతే ఆ పార్టీకి ఇబ్బందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చావో రేవో తేల్చుకొంటున్నాడు జగన్.

మరో వైపు ఏపీలో అభివృద్ధి సాగాలంటే తనకు మరోసారి అవకాశం కల్పించాలని చంద్రబాబునాయుడు  ప్రచారం చేశారు. టీఆర్ఎస్‌తో జగన్ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేశారని బాబు ఆరోపణలు చేశారు. 

ఈ ఎన్నిల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా  45,920 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఏపీలోని 175, 25 ఎంపీ స్థానాలకు టీడీపీ, వైసీపీలు పోటీ చేస్తున్నాయి. జనసేన 137 అసెంబ్లీ స్థానాలకు, 16 ఎంపీ స్థానాలకు పోటీ పడుతోంది. జనసేన కూటమిలో ఉన్న బీఎస్పీ 13 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు, సీపీఎం, సీపీఐలు  ఏడేసి అసెంబ్లీ స్థానాలతో పాటు రెండేసి ఎంపీ స్థానాలకు పోటీకి దిగాయి.

బీజేపీ 173 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు, కాంగ్రెస్ 174 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు 1249 అభ్యర్థులను బరిలోకి దింపారు. ఎంపీ స్థానాల్లో స్వతంత్రులు 193 మంది బరిలో ఉన్నారు.

రాష్టంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో  2,118 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 25 ఎంపీ స్థానాలకు 319 మంది పోటీలో ఉన్నారు. గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి అత్యధికంగా 34 మంది పోటీలో ఉన్నారు.

 ఆ తర్వాతి స్థానంలో మంగళగిరి నుండి 32 మంది పోటీ చేస్తున్నారు. ఇచ్చాపురం, రాజాం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో ఆరుగురు మాత్రమే బరిలో ఉన్నారు.ఇక నంద్యాల ఎంపీ స్థానం నుండి అత్యధికంగా 20 మంది పోటీ చేస్తుండగా, అత్యల్పంగా చిత్తూరు ఎంపీ స్థానం నుండి కేవలం 8 మంది మాత్రమే బరిలో నిలిచారు.

సంబంధిత వార్తలు

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.