Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
 

Election commission complets arrangements for polling on april 17
Author
Hyderabad, First Published Apr 10, 2019, 3:24 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టలు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు మాత్రమే పోలింగ్ ‌నిలిపివేయనున్నారు. రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మావోల ప్రభావం ఉంటుందని  అధికారులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతోంది.

నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించడానికి ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు, 17 మంది సాధారణ పరిశీలకులు, 34 మంది వ్యయ పరిశీలకులు, 10 మంది పోలీస్ పరిశీలకులు వచ్చారు. 

 రాష్ట్రంలో తొలి దశలోనే మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 185 మంది పోటీపడుతున్నారు. అత్యల్పంగా మెదక్ పార్లమెంటుకు 10 మంది బరిలో ఉన్నారు.ఈ ఎన్నికల్లో 25 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మహబూబాబాద్ ఎంపీ స్థానం నుండి బరిలో ఉన్నారు. మహబూబాబాద్‌ ఎంపీ స్థానంలో నలుగురు పోటీ చేస్తున్నారు.

 రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 17 స్థానాలకు పోటీచేస్తుండగా.. ఎంఐఎం ఒక స్థానంలో, బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2చోట్ల బరిలో పోటీ చేస్తున్నాయి. గుర్తింపుపొందిన ఈ పార్టీల నుంచి మొత్తం 61 మంది పోటీచేస్తుండగా.. రిజిస్టర్ అయిన పార్టీలవారు 83 మంది, స్వతంత్ర అభ్యర్థులు 299 మంది పోటీలో ఉన్నారు.

 రాష్ట్రంలో 2,97,08,599 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 34,604 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి 2.80 లక్షల మంది సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించారు. ఎన్నికల నిర్వహణ కోసం మూడు హెలికాప్టర్లను కూడ ఉపయోగించనున్నారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్ కాగజ్‌నగర్ , ఆసిఫాబాద్,  చెన్నూర్,  బెల్లంపల్లి,  మంచిర్యాల,మంథని,  భూపాలపల్లి,  ములుగు,  పినపాక,  ఇల్లందు,  భద్రాచలం,  కొత్తగూడెం,  అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. 

నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎక్కువమంది పోటీలో ఉన్నందున ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. నిజామాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాత పోలింగ్ మొదలవుతుంది. పోలింగ్ సిబ్బంది అంతా బుధవారం మధ్యాహ్నం తరువాత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వెళ్లి ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.

ఓటర్లు తమ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 1950కి ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. అలాగే 9223166166 నంబర్‌కు ఎస్సెమ్మెస్ కూడా చేయవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు తన ఎపిక్ కార్డు నంబర్ టైప్ చేసి ఎస్సెమ్మెస్ చేస్తే వెంటనే పోలింగ్‌స్టేషన్ సమాచారం తెలుస్తుంది. అలాగే ఈసీఐ రూపొందించిన నా ఓట్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నందున బెల్ కంపెనీ సరఫరా చేసిన ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. దేశంలో మొదటిసారిగా ఇక్కడే ఎం3 ఈవీఎంలను వినియోగించడం గమనార్హం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఎల్ ఆకారంలో 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌ను అమర్చుతారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ఒక్క నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోనే 600 మంది ఇంజినీర్లను డిప్యూట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios