అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకొన్నారు.

ఏపీ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నాటికి ఏపీ జనాభా  5,30,01,971. అందులో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717గా నమోదైంది. అయితే ఇందులో పురుషులు 1,94,62,339, స్త్రీ ఓటర్లు 1,98,79,421.   ట్రాన్స్‌జెండర్లు3967 మంది కూడ తమ ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు.

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలోని గాజువాకలో అత్యధికంగా  3,09,326 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో భీమిలి అసెంబ్లీ స్థానం నిలుస్తోంది.ఈ స్థానంలో 3,05,958 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా పెడన నియోజకవర్గంలో 1,66,177 ఓటర్లున్నారు.

ఈ ఎన్నిల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా  45,920 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఏపీలోని 175, 25 ఎంపీ స్థానాలకు టీడీపీ, వైసీపీలు పోటీ చేస్తున్నాయి. జనసేన 137 అసెంబ్లీ స్థానాలకు, 16 ఎంపీ స్థానాలకు పోటీ పడుతోంది. జనసేన కూటమిలో ఉన్న బీఎస్పీ 13 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు, సీపీఎం, సీపీఐలు  ఏడేసి అసెంబ్లీ స్థానాలతో పాటు రెండేసి ఎంపీ స్థానాలకు పోటీకి దిగాయి.

బీజేపీ 173 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు, కాంగ్రెస్ 174 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు 1249 అభ్యర్థులను బరిలోకి దింపారు. ఎంపీ స్థానాల్లో స్వతంత్రులు 193 మంది బరిలో ఉన్నారు.

రాష్టంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో  2,118 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 25 ఎంపీ స్థానాలకు 319 మంది పోటీలో ఉన్నారు. గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి అత్యధికంగా 34 మంది పోటీలో ఉన్నారు.

 ఆ తర్వాతి స్థానంలో మంగళగిరి నుండి 32 మంది పోటీ చేస్తున్నారు. ఇచ్చాపురం, రాజాం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో ఆరుగురు మాత్రమే బరిలో ఉన్నారు.ఇక నంద్యాల ఎంపీ స్థానం నుండి అత్యధికంగా 20 మంది పోటీ చేస్తుండగా, అత్యల్పంగా చిత్తూరు ఎంపీ స్థానం నుండి కేవలం 8 మంది మాత్రమే బరిలో నిలిచారు.

సంబంధిత  వార్తలు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.