న్యూఢిల్లీ: రాజకీయ ప్రత్యర్థులు జాతీయ స్థాయిలో ఒకే వైపు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆయన ప్రత్యర్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో ఒకే శిబిరంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి రాకుండా చేయాలనే ఎకైక లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. అవసరమైతే తన ప్రత్యర్థులను కూడా కాంగ్రెసు కూటమిలోకి తేవడానికి తగిన వెసులుబాటు కల్పిస్తున్నట్లు అర్థమవుతోంది. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు రాహుల్ గాంధీతో భేటీ అవుతూ వ్యూహరచన చేస్తున్నారు. 

బిజెపియేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్థుల జాబితాను ఎన్సీపి నేత శరద్ పవార్ చెబుతూ చంద్రబాబును పేరును కూడా ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ప్రధాని కాలేని పక్షంలో ప్రధానిగా చంద్రబాబును నిలబెట్టే ప్రయత్నాలు కూడా జరగవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే, ఈ స్థితిలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రకటన చేశారు. 

యుపిఎ లేదా ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని అన్ని వైపుల నుంచి కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన ఆ ప్రకటన చేశారు. తాను ప్రధాని పదవికి రేసులో లేనని ఒకటికి రెండు సార్లు చెప్పారు. కేసీఆర్, జగన్ కూడా తమ కూటమి వైపు రావడానికి ఆయన ఆ ప్రకటన ద్వారా వెసులుబాటు కల్పించారని చెప్పవచ్చు. 

చంద్రబాబు ప్రధాని కాకపోతే ఇతరులు ఎవరైనా బహుశా జగన్మోహన్ రెడ్డికి గానీ కేసీఆర్ కు గానీ అభ్యంతరం ఉండకపోవచ్చు. చంద్రబాబు ప్రధాని అవుతారంటేనే వారు దూరం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేసి, వారిని కాంగ్రెసుకు దగ్గర చేసే వ్యూహాన్ని అనుసరించారు.

కాంగ్రెసు మద్దతు తీసుకుని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ స్థితిలో అవసరమైతే యుపిఎకు కేసీఆర్ కేంద్రంలో మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 

ఎపికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. తాము ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారు. అందువల్ల యుపిఎను బలపరచడానికి జగన్మోహన్ రెడ్డికి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ ను జగన్ బలపరిచే అవకాశాలున్నాయి.  

యుపిఎ భాగస్వామ్య పక్షాలతో కలిసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే కేసీఆర్, జగన్ బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రాంతీయ పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెసు మద్దతును బయటి నుంచి తీసుకునే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

రాహుల్ గాంధీ ప్లాన్: కేసీఆర్ తో చిదంబరం, జగన్ తో ప్రణబ్ ముఖర్జీ

కాంగ్రెసుతో దోస్తీకి కేసీఆర్ రాయబారాలు: జగన్ తోనూ సంప్రదింపులు

రూట్ మార్చిన కేసీఆర్: మోడీకి కటీఫ్, రాహుల్ తో దోస్తీ

మోడీ, కేసీఆర్ మధ్య బెడిసికొట్టిన సంబంధాలు: అమిత్ షా ఫోన్