Asianet News TeluguAsianet News Telugu

రూట్ మార్చిన కేసీఆర్: మోడీకి కటీఫ్, రాహుల్ తో దోస్తీ

కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమికి ప్రయత్నాలు సాగిస్తూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా యుపిఎకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  వినోద్ కుమార్ చేసిన ప్రకటన కూడా కేసీఆర్ కాంగ్రెసుకు దగ్గర కావాలని చూస్తున్నట్లు సంకేతాలను ఇస్తోంది. 

TRS chief KCR may favour Congress
Author
Hyderabad, First Published May 9, 2019, 11:42 AM IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమికి ప్రయత్నాలు సాగిస్తూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా యుపిఎకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి కేసీఆర్ ఫోన్ చేయడం గానీ, డిఎంకె అధినేత స్టాలిన్ తో భేటీ కావడానికి చూడడం గానీ అందుకేనని అంటున్నారు. ఎన్నికల సమయంలో బిజెపి కార్యకర్తల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్న సంఘటన, వారణాసిలో తెలంగాణ రైతుల నామినేషన్ల వేసిన ఘటన మోడీతో కేసీఆర్ కు దూరం పెంచినట్లు భావిస్తున్నారు. 

టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ చేసిన ప్రకటన కూడా కేసీఆర్ కాంగ్రెసుకు దగ్గర కావాలని చూస్తున్నట్లు సంకేతాలను ఇస్తోంది. ఈసారి యునైటెడ్‌ ఫ్రంట్‌ తరహా ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతు ఇస్తే, ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అటువంటి సంకీర్ణమే ఏర్పడుతుంది. ఇందులో సందేహం అక్కర్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి బిజెపితో కాకుండా కాంగ్రెసుతో కలిసి నడవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసుకు వందకు పైగా సీట్లు వస్తాయని, బిజెపికి 170కి మించి రావని వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెసు సహాయం తీసుకుని 1996లో మాదిరిగా ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. 

కాంగ్రెసు మద్దతు లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కేసీఆర్ చర్చల సందర్భంగా అదే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. వీరిద్దరి భేటీలో వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు. 

అవసరమైతే రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి సహకరించాలని, బిజెపికి పూర్తిగా దూరం జరగాలని టీఆర్ఎస్ లో అంతర్గతంగా ఓ అభిప్రాయం చెలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు చాలా మటుకు కాంగ్రెసుతో కలిసి నవడానికే ఇష్టపడుతున్న విషయం రహస్యమేమీ కాదు. కొంత మందికి ఇష్టం లేకపోయినప్పటికీ బిజెపిని నిలువరించడానికి కాంగ్రెసుకు మద్దతు ఇస్తారని అంటున్నారు 

డిఎంకె, ఎన్సీపీ, ఎస్పీ, బిఎస్పీ, జనతాదళ్ (ఎస్), తృణమూల్ కాంగ్రెసు పార్టీలకు బిజెపి ప్రధాన శత్రువు. ఈ పార్టీలు అవసరమైతే కాంగ్రెెసుకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు. స్టాలిన్, కుమారస్వామి వంటి నాయకులు ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగానే నిలుస్తుంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. తనకు తగినన్ని సీట్లు వస్తే కాంగ్రెసుకు మద్దతు ఇవ్వడానికి ఆయనకు ఏ విధమైన అటంకమూ ఉండకపోవచ్చు. ఎందుకంటే, ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. 

వామపక్షాలు కాంగ్రెసు వైపే ఉంటాయనే విషయంలో సందేహం అవసరం లేదు. బిజెడి చీఫ్ నవీన్ పట్నాయక్ మాత్రం బిజెపి, కాంగ్రెసులకు సమదూరం పాటిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే కేసీఆర్ తన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలా, ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలా అనేది ఆయన తేల్చుకుంటారు.

ఆలమట్టి నుంచి జూరాలకు నీటి విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ టెలిఫోన్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జాతీయ రాజకీయాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగిందని కన్నడ పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు భిన్నంగా, కాంగ్రెస్‌తో సఖ్యతకు కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నారని, ఇందుకు జేడీఎస్‌ సహకారాన్ని కోరారని కుమారస్వామి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ వార్తాకథనాలను ప్రచురించాయి.
 
కేసీఆర్‌ ప్రతిపాదనకు కుమారస్వామి కూడా ఆసక్తి చూపారనిఅంటున్నారు. ప్రధానిగా మోడీ విఫలమయ్యారని, రాహుల్‌ రోజురోజుకు పరిణతి చెందుతున్నారంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

ఇదిలావుంటే,  కేరళలోని కోవళంలో ఉన్న సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం కన్యాకుమారికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఉన్న కన్యాకుమారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. సూర్యాస్తమయాన్ని వీక్షించినట్లు తెలిసింది. గురువారం కేసీఆర్‌, ఆయన కుటుంబం రామేశ్వరం, శుక్రవారం మధురై వెళుతుందని తెలుస్తోంది. ఆయన పర్యటన షెడ్యూల్‌లో పాండిచ్చేరి సందర్శన కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios