జీవితాంతం ఆనందంగా కలిసి జీవించాలనే పెళ్లిళ్లు చేస్తారు. కాని ప్రతి జంట జీవితాంతం వరకు అలా ఉండలేరు. ఈ కాలంలో చాలా త్వరగా విడిపోతున్నారు. కాని కొంత మంది మాత్రం కష్టమైనా బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీని వెనకాల కొన్ని ముఖ్యమైన అడ్జస్ట్ మెంట్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యువతి యువకుల మధ్య బంధం పెళ్లితోనే సుఖాంతం అవ్వాలని లేదు. ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావచ్చు. వీటిని సర్దుకుపోతే వారు ఆనందంగా జీవించగలుగుతారు. కాని అడ్జస్ట్ మెంట్ లేకపోతే ఆ బంధం ఎంతోకాలం నిలవదు. అయినా కూడా కొంతమంది కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఇష్టం లేకపోయినా కష్టపడుతూ బంధాన్ని కొనసాగిస్తుంటారు. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఒంటరితనం భయం

ఎవరితోనైనా ఎక్కువ కాలం ఉన్న తర్వాత ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. కష్టసుఖాల్లో తోడుగా ఉన్న వ్యక్తి విడిపోయి వెళ్లిపోతే ఆ లోటు భరించడం కష్టం. ఒంటరితనం భయంతోనే చాలా మంది సంతోషంగా లేని బంధాన్ని కొనసాగిస్తుంటారు. 

2. అలవాటైన వాటితోనే సుఖంగా ఉండటం

ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ బంధం జీవితంలో భాగం అయిపోతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తిలో చెడు విషయాలు కనిపించినా పెద్ద సీరియస్ గా తీసుకోరు. అలవాటైన వ్యక్తి కష్టపెట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు ఆ వ్యక్తితో విడిపోయి, తెలియని కొత్త బంధంలోకి రావడం కంటే బాధ పెట్టినా ఆ వ్యక్తితోనే జీవించాలని చాలా మంది అడ్జస్ట్ అయి బతికేస్తుంటారు. 

3. అడ్జస్ట్ అయి బతికేయడం..

చాలామంది తప్పు వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారని అంగీకరించరు. అందుకే బంధంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని పట్టించుకోరు. వచ్చిన సమస్యలన్నీ చిన్నవే అనుకుంటారు. అడ్జస్ట్ అయి జీవించడం అలవాటు చేసుకుంటారు.

4. లైఫ్ పార్ట్‌నర్ ని బాధ పెట్టకూడదనుకోవడం

కొన్నిసార్లు సొంత అభిప్రాయాల కంటే భాగస్వామి భావాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. వాళ్ళని బాధ పెట్టాలంటేనే మనసు ఒప్పుకోదు. వాళ్ళు బాధ పడటం చూడలేక బాధపడుతూనే బంధాన్ని కొనసాగిస్తారు. 

5. మంచి విషయాలనే గుర్తు పెట్టుకోవడం

పెళ్లి బంధాన్ని కొనసాగించాలనుకునే వారు చిన్న సాయాన్ని కూడా మంచి విషయాలను చేసి చూస్తారు. భాగస్వామి ఒకరోజు ఇంట్లో పాత్రలు కడిగినా ఎంతో మంచివారని, ఎంతో ప్రేమిస్తున్నారని అనుకుంటారు. తర్వాత కష్టమొచ్చినా ఆ బంధాన్ని విడిచిపెట్టాలనుకోరు. 

6. కొట్టినా, చంపే ప్రయత్నం చేసినా విడిపోరు

భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం చాలా పెద్ద సమస్య. దీనికి ప్రధాన కారణం ఇష్టారాజ్యంగా మాట్లాడటం. అలాంటి సమయంలో భార్య, భర్త ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఒక్కోసారి ఆవేశంలో చంపే ప్రయత్నం కూడా చేస్తారు. అయినా కూడా సమాజం కోసం, స్వప్రయోజనాల కోసం కొందరు బంధాలను కొనసాగిస్తారు. 

7. సమాజం లేదా కుటుంబం కోసం..

జీవిత బంధం కష్టంగా ఉన్నా స్నేహితులు, కుటుంబం, చుట్టుపక్కల వారు ఏమనుకుంటారోనన్న భయంతో, ఒత్తిడి బంధాన్ని కొనసాగిస్తారు. "జనాలు ఏమనుకుంటారు?" అనే ఆలోచనతో కూడా చాలా మంది తమ సంతోషాన్ని పణంగా పెట్టి బంధాన్ని కొనసాగిస్తుంటారు.

8. పరిస్థితులు మారతాయనే ఆశ

ప్రేమలో ఉన్నప్పుడు ఒకరోజు అంతా బాగుంటుందని అనుకుంటారు. "వాళ్ళు మారిపోతారు", "ఇదంతా తాత్కాలికమే" అనే ఆశతో కష్టమైన బంధంలోనే జీవితాంతం ఉంటారు.