మీ గుండె ఆరోగ్యంగానే ఉందా.? తెలుసుకోవాలంటే ఇవి చెక్‌ చేసుకోండి..

గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సమస్యలు ఎక్కువవుతున్నాయి. అయితే ముందుగానే జాగ్రత్త పడితే గుండె సమస్య తీవ్రత నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మీ గుండె ఆరోగ్యంగానే ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని రకాల లక్షణాలతో తెలుసుకోవచ్చు అవేంటంటే.. 
 

These things indicate that your heart is working in correct condition VNR

మనిషి జీవించాలంటే గుండె ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క నిమిషం గుండె ఆగిపోతే చాలు మనిషి ఊపిరి ఆగిపోతుంది. అలాంటి గుండె ఇప్పుడు లయ తప్పుతోంది. చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి తర్వాత గుండె పోటు మరణాలు బాగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతీ ఏటా ఏకంగా 17.9 బిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. వీరిలో 85 శాతం మంది గుండెపోటు, పక్షవాతం కారణంగానే మరణిస్తున్నారు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం, చెడు అలవాట్లు, మారిన ఆహార విధానం వెరసి గుండె ఆరోగ్యం దెబ్బతింటోంది. 

గుండెపోటుకు కారణం.. 

శరీరంలో కొవ్వ పేరుకుపోవడం వల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో గుండె వెళ్లే రక్తం వేగం తగ్గుతుంది. ధమనులు పూర్తిగా మూసుకుపోయినప్పుడు గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారి తీస్తుంది. అయితే గుండెలో సమస్యలు తలెత్తే విషయాన్ని మన శరీరం ముందుగానే మనల్ని అలర్ట్‌ చేస్తుంది. కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

కొలెస్ట్రాల్ స్థాయిలు 

శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ నార్మల్‌గా ఉంటే అది ఆరోగ్యకరమైన గుండెకు సంకేతంగా చెప్పొచ్చు. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం  పెరిగితే అది గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందని గుర్తించాలి. తీసుకునే ఆహారంలో మార్పులతో పాటు వాకింగ్, వ్యాయామం చేయడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. 

రక్తపోటు 

గుండెకు మరో ప్రధాన శత్రువు రక్తపోటు. శరీరంలో రక్తపోటు ఎప్పుడు నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. బీపీ నార్మల్‌గా ఉందంటే గుండె ఆరోగ్యంగా ఉందని అర్థం చేసుకోవాలి. బీపీ నార్మల్‌గా ఉంటే ధమనులు సక్రమంగా పనిచేస్తున్నాయని, వాటిలో ఎలాంటి అడ్డంకులు లేవన్నట్లు. అందుకే హైబీపీ ఉన్న వారు గుండె ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బీపీ కంట్రోల్‌లో ఉండేందుకు తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించడంతో పాటు యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. 

ఛాతీలో నొప్పి 

ఛాతీలో నొప్పి రావడం గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెప్పడానికి సంకేతంగా భావించాలి. ఎక్కువగా నడుస్తున్న సమయంలో లేదా వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి వస్తున్నట్లయితే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఛాతీలో నొప్పి అన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యకు సంకేతం కాకపోయినా.. వైద్య పరీక్షలు చేయించుకోవడం మాత్రం మంచిది. 

శ్వాస

మీ గుండె ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి మరో సంకేతం శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోవడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండే గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని అర్థం చేసుకోవాలి. గుండె సంబంధిత సమస్యలున్న వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ అందడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

రోజంతా ఉషారుగా 

మీరు రోజంతా ఎలాంటి నిస్సత్తువ లేకుండా ఉషారుగా ఉంటున్నారంటే మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా హార్ట్‌ బ్లాక్‌ లేదా మరే ఇతర గుండె సంబంధిత సమస్యలున్నా త్వరగా అలసిపోతుంటారు. నాలుగు అడుగులు వేసే సరికి ఆయాసం వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉంటే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది. 

హార్ట్‌ బీట్‌ 

మీ హార్ట్‌ బీట్‌లో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా సక్రమంగా ఉండే అది ఆరోగ్యకరమైన గుండెకు సంకేతంగా భావించాలి. మరీ వేగంగా లేదా మరీ నెమ్మదిగా గుండె కొట్టుకుంటుంటే అది గుండె జబ్బుకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. 

చేతులు, పాదాల్లో వాపు 

సాధారణంగా గుండె సంబంధిత సమస్యలున్న వారి కాళ్లు, చేతుల్లో వాపు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం గుండె సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని ఈ ప్రాంతాలకు ఆక్సిజన్‌ సరిగ్గా అందదు. ఇది కాళ్లు, చేతుల్లో వాపునకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios