మగువలు మెచ్చే ‘లక్క గాజుల’కు కేరాఫ్ అడ్రస్ లాడ్ బజార్ ..
గాజులంటే ఇష్టముండని మహిళలే ఉండరు.. ఒక రకంగా చెప్పాలంటే ఏ రంగు చీరకు ఆ రంగు గాజులను కొనేవారు చాలా మందే ఉన్నారు. రంగు రంగుల్లో లభించే రమ్యమైన గాజులను చూస్తే మనసెలా ఊరుకుంటుంది చెప్పండి. అందుకే మనసుకు నచ్చిన గాజులను కొనేస్తుంటారు. అందులోనూ హైదరాబాద్ లాడ్ బజార్ లో దొరికే లక్క గాజులకున్న ప్రత్యేకతే వేరు. ఈ గాజులను చూడగానే చేతులకు వేసుకోవాలని అన్నంతగా మురిపిస్తాయి. అలాంటి గాజుల ప్రత్యేకతేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళలకు గాజులను విడదీయలేని సంబంధం ఉంటుంది. పెళ్లైన వారే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలు సైతం రంగు రంగుల్లో ఉండే మనసైన గాజులను డజన్లకు డజన్లు కొనేస్తుంటారు. పెళ్లిళ్లు.. ఫంక్షన్లు వచ్చినప్పుడు.. ఆ చీరకు లేదా డ్రెస్ కు మ్యాచ్ అయ్యే గాజులను వేసుకుని మురిసిపోతుంటారు. అందులోనూ మార్కెట్ లోకి కొత్త కొత్త మోడల్స్ లల్లో గాజులు వస్తున్నాయి. ఇక పండగొస్తే మహిళల చేతులకు పక్కాగా గాజులుండాల్సిందే. మరి మగువల సున్నితమైన చేతులకు చక్కగా ఉండే గాజులకు కేరాఫ్ అడ్రస్ లాడ్ బజారే. ఇక్కడ దొరికే ‘లక్క గాజులంటే’ అమ్మాయిలకు తెగ ఇష్టం. ఏరికోరి ఎంత డబ్బైనా సరే వీటినే కొంటుంటారు. ఈ గాజులను లక్కతో తయారు చేస్తారు. ఈ లక్కను లాడ్ అని కూడా అంటారు. అందుకే ఈ గాజులను లాడ్ బజార్ గాజులు అని కూడా పిలుస్తారు.ఈ గాజులు చార్ మినార్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతారు కాబట్టి దానికి లాడ్ బజార్ అనే పేరు కూడా వచ్చింది.
చార్మినార్ లో మట్టిగాజుల నుంచి మొదలు పెడితే మెటల్ గాజుల వరకు తీరొక్క రంగుల్లో గాజులు లభిస్తాయి. అందులోనూ ఇవి మరీ ఎంత ఖరీదైనవో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ గాజులు కేవలం 5 రూపాలయ నుంచి 15 వేల రూపాయల ఖరీదైన గాజులు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇక్కడ తీరొక్క డిజైన్లతో మనసు మెచ్చే విధంగా మనకు అందుబాటులో ఉంటాయి. గ్రామాల నుంచి మొదలు పెడితే.. పట్టణాల్లోని ప్రజలకు కూడా గాజులంటే ఠక్కున గుర్తొచ్చేది లాడ్ బజారే. మంచి డిస్కౌండ్, ఆఫర్లతో మహిళలను ఆకర్షిస్తూ ఉంటాయి. అందులోనూ రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగులో ఈ గాజులు చూడముచ్చగా కనిపిస్తాయి.
ఎన్నో రకాలు..
లాడ్ బజార్ లో మెటల్, ఫైబర్, మట్టి గాజులు, ఎనామిల్, డైమండ్స్ , గోట్లు, మిర్రర్, బ్రాస్ వంటి ఎన్నో సరికొత్త గాజులు అందుబాటులో ఉంటాయి. పెళ్లిళ్లలకు, పార్టీలకు అంటూ తీరొక్క దానికి లభిస్తాయి. ఈ బజార్ లో ఎన్ని గాజులు అందుబాటులో ఉన్నాయి. అందులో లక్క గాజులకున్న డిమాండ్ మరే గాజులకు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే లక్క గాజులు ఎన్నటికీ వన్నె తగ్గవు. మెరుపును కోల్పోవు. అవి పగిలిపోయేంత వరకు కొత్తవిగానే కనిపిస్తాయి. అందుకే ఈ గాజులంటే ఆడవారికి తెగ ఇష్టం.
లాడ్ బజార్ అంటే..
లాడ్లా అంటే ప్రేమ, గారాబానికి, అనురాగం అని అర్థాలు వస్తాయి. ఉర్దూ భాష ప్రకారం.. మనకు అత్యంత ఇష్టమైన వారిని లాడ్లా అని పిలుస్తారట. ఇందులో చిన్నారులనే ఈ పేరుతో పిలిచేవారు. ఈ ప్లేస్ నుంచి కానుకలు కొని ఇష్టమైన వారికి ఇచ్చినందుకే ఈ పేరు వచ్చిందని కొందరు అంటుంటారు.
లాడ్ బజార్ లోని రంగు రంగుల గాజులనే.. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రియురాలైన భాగమతికి కానుకగా ఇచ్చేవాడట. అంతేకాదు భారత కోకిలగా పిలవబడే సరోజినీ నాయుడు కూడా లాడ్ బజార్ లోనే గాజులను కొనేవారు.
లక్షల్లో వ్యాపారాలు..
గాజులకు ప్రఖ్యాతి గాంచిన లాడ్ బజార్ లో సుమారుగా 250 కి పైగా షాపులు ఉన్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ఒక్కో దుకాణాదారు రంజాన్ మాసంలో 50 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తాడట.
భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ లాడ్ గాజులకు భౌగిళిక గుర్తింపు (జీఐ) దక్కింది. ఈ మేరకు చేసిన దరఖాస్తును తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న జీఐ రిజిస్ట్రీ ఆఫీసు గురువారం ఆమోదించింది. దీంతో ఇప్పుడు ఈ గాజులకు మరింత గొప్ప పేరు రానుంది.
వీటిని ఐదు వందల సంవత్సరాల కిందట మొఘలుల కాలంలోనే తయారు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి గాజులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా దొరకవు. వీటి తయారీపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ వివరాలను అన్నీ సేకరించి జీఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు గురువారం ఆ దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ గుర్తింపు ఖాయమైంది. అయితే త్వరలో అధికారులు వచ్చి ఈ లాడ్ బజార్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తరువాత అధికారికంగా ఇక్కడి నుంచి ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఇప్పుడు ఈ లక్క గాజులకు జీఐ గుర్తింపు రావడంతో ఆఫీసర్లు స్పెషల్ గా ఈ గాజుల లోగోను తయారు చేయించారు. ఈ జీఐ గుర్తింపు రావడంతో మరింత మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.