వేడివేడిది తిని నాలుక కాలిందా? ఇలా చేస్తే రిలీఫ్
చలికాలంలో వేడివేడిగా తింటేనే టేస్ట్ గా అనిపిస్తుంది. అలాగే శరీరం కూడా వెచ్చగా ఉంటుంది. ఈ సీజన్ లో చల్లని ఫుడ్ ను తినడం చాలా కష్టం. అయితే మరీ వేడి వేడిగా తిన్నప్పుడు ఖచ్చితంగా నాలుక కాలుతుంది. మంటగా అనిపిస్తుంది. దీనివల్ల అసౌకర్యంగా ఉండటమే కాదు.. ఫుడ్ రుచి కూడా తెలియదు. ఈ సమస్య చాలా రోజుల వరకు ఉంటుంది. అయితే నాలుక కాలినప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే.. సమస్యే ఉండదు. అవేంటంటే..
వేడివేడి ఫుడ్ ను తినడం వల్ల ఫుడ్ రుచి బాగుంటుంది. అందులోనూ చలికాలంలో చాలా మంది ఎలాంటి ఫుడ్ నైనా వేడివేడిగానే తింటుంటారు. ఎందుకంటే చల్లగా తింటే మరింత చలి పెడుతుందని. అయితే వేడివేడి తింటున్నప్పుడు చాలా సార్లు నాలుక కాలిపోతుంది. దీనివల్ల అసౌకర్యంగా ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా టేస్ట్ గా అనిపించదు. రెండు మూడు రోజుల తర్వాత నయమవుతుంది. అయితే ఈ సమస్య వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడితే మాత్రం ఈ చిట్కాలను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవి నాలుక మంటను, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.
పెరుగు
వేడి వేడి ఫుడ్ ను తిని నాలుక కాలినప్పుడు మీ ఇంట్లో పెరుగు ఉంటే ఖచ్చితంగా తినండి. పెరుగులోని చల్లదనం మంట అనుభూతిని తగ్గిస్తుంది. అందుకే నాలుక కాలినప్పుడు, మండినప్పుడల్లా ఒక చెంచా పెరుగు తీసుకుని కాసేపు నోట్లో పెట్టుకోండి. పెరుగు మీ శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.
బేకింగ్ సోడా
చిటికెడు బేకింగ్ సోడా ఎన్నో సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది కూడా. దీన్ని నాలుక మంటను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. దీనిలో ఉండే ఆల్కైన్ స్వభావం నాలుక చికాకు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం బేకింగ్ సోడాను నీటిలో కరిగించి తర్వాత నాలుకను కడగండి.
చక్కెర
నాలుకపై కాలిన గాయాలకు తక్షణ ఉపశమనం కలిగించడంలో చిటికెడు చక్కెర కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేడివేడిది తిని మీ నోరు మంటగా అనిపిస్తే.. వెంటనే నోట్లో పంచదార వేసి దానంతట అదే కరిగిపోనివ్వాలి. ఈ సమయంలో మీరు నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల చికాకు, నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
తేనె
నాలుక మంటను తగ్గించడానికి కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు తేనెను నాకడం వల్ల కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనెలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
కలబంద జెల్
నాలుక మంటను తగ్గించడానికి కలబంద జెల్ కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నాలుకకు కలబంద జెల్ ను రాస్తే నాలుక మంట తగ్గిపోతుంది. ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేసే అలోవెరా జెల్ ను ఐస్ క్యూబ్ గా తయారుచేసుకోవాలి. దీనిని నాలుకకు కొద్ది సేపు పూయండి. అలాగే దీన్ని మీరు చర్మ సంరక్షణలో కూడా ఉపయోగించొచ్చు.
సాధారణ ఆహారాన్ని తినండి
నాలుక కాలిపోయినప్పుడు వీలైనంత సింపుల్ ఫుడ్ నే తినండి. ఈ సమయంలో మీరు ఎక్కువ స్పైసీ గా ఉండే ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. సింపుల్ ఫుడ్ మీ నాలుకను చల్లగా ఉంచుతుంది. దీంతో మీ నాలుక త్వరగా కోలుకుంటుంది.
ఐస్ క్యూబ్
కాలిన నాలుక నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ క్యూబ్ కూడా బాగా ఉపయోగపడతాయి. దీనికోసం మీరు పెద్దగా చేయాల్సిన పని లేదు. ఇందుకోసం మీరు ఐస్ క్యూబ్ ను తీసుకుని చప్పరించండి. ముందుగా మీరు ఐస్ క్యూబ్ ను సాధారణ నీటితో తేలికగా తడపండి. దీనివల్ల మీ నాలుకకు ఐస్ అంటుకోకుండా నిరోధిస్తుంది.