దానం చేయడం పుణ్యకార్యమే. కానీ తప్పుడు పద్ధతిలో చేసిన దానం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తన నీతిసూత్రాల్లో బోధించాడు. ఇప్పటికీ వాటిని చాలామంది పాటిస్తుంటారు. ప్రేమ, పెళ్లి, స్నేహం, నమ్మకం, మోసం, దానం ఇలా ప్రతి విషయం గురించి ఆయన బోధించాడు. చాణక్యుడి ప్రకారం దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఏ దానం మీ ఆర్థిక పరిస్థితికి మంచిది కాదో తెలుసుకోండి
దానం చేయడం పుణ్యకార్యం. పేదలపై దయ ఉన్నవారు తరచుగా దానం చేస్తుంటారు. కానీ చాణక్యుడి ప్రకారం తప్పుడు పద్ధతిలో చేసిన దానం మీ ఆర్థిక పరిస్థితికి మంచిది కాదు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దానం చేయడం మంచిది.
దానం కూడా ఆలోచనాత్మకంగా చేయాలి
ఆలోచించకుండా చేసిన దానం కొన్నిసార్లు వారికే ఇబ్బందికరంగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది. తమ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా భావోద్వేగాలకు లోనై దానం చేసేవారు ఇబ్బందుల్లో పడతారు. చాణక్యుడి ప్రకారం దానం చేసే ముందు కొంచెం ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.
జేబు ఖాళీ చేసి మరీ ఎప్పుడూ దానం చేయద్దు
ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ తిరిగి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ చాణక్యుడి ప్రకారం మొత్తం ఆస్తిని దానం చేసేవారు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. కాబట్టి పరిస్థితిని గమనించి దానం చేయడం ఉత్తమం.
అనర్హులకు దానం చేయకండి
చాణక్య నీతి ప్రకారం అనర్హులకు దానం చేయడం మంచిది కాదు. ఆవును పోషించలేని వ్యక్తికి మీరు ఒక ఆవును దానం చేస్తే, ఆ ఆవు బ్రతకదు. అదేవిధంగా డబ్బును ఎలా నిర్వహించాలో తెలియని వ్యక్తికి కోట్లు ఇచ్చినా వృథా అవుతుంది. కాబట్టి ఆలోచించి దానం చేయడం మంచిది.
చేసిన మేలు మరచిపోయేవారికి దానం చేయకండి
చేసిన సహాయాన్ని గుర్తుంచుకోని వ్యక్తులకు దానం చేయడం.. మీ కాళ్లను మీరే గొడ్డలితో నరుక్కోవడం లాంటిదని చాణక్య నీతి చెబుతోంది. కృతజ్ఞత లేని వ్యక్తులకు దానం చేయడం వల్ల పుణ్యం రాకపోగా.. ఇబ్బందులు వస్తాయని చాణక్యుడు బోధించాడు.
అవసరానికి మించి దానం చేయడం తప్పు
చాణక్యుడి ప్రకారం అవసరానికి మించి దానం చేయడం తప్పు. దానం మిమ్మల్ని బలహీనపరచకూడదు.
ఇమేజ్ కోసం దానం చేయడం పాపం లాంటిది
కొంతమంది సమాజంలో ఇమేజ్ కోసం దానం చేస్తుంటారు. అలాంటి వారికి దాని ఫలితం దక్కదని చాణక్య నీతి చెబుతోంది.
ధార్మిక దానం
దేవాలయాల్లో దానం చేయడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు. సోమవారం శివుడికి, శనివారం శని దేవుడికి, ఆదివారం అమ్మవారి దేవాలయాల్లో దానం చేయడం శుభప్రదం.
