Homemade ORS: ఎండాకాలంలో చాలా దాహం వేస్తుంది.  డీహైడ్రేషన్ సమస్య త్వరగా వచ్చేస్తుంది. ఒంట్లో నీరసంగా, శక్తి లేనట్టు అనిపిస్తుంది. బయట కొనే ఓఆర్ఎస్ ప్యాకెట్ల కన్నా ఇంట్లోనే ఓఆర్ఎస్ డ్రింకులు తయారు చేసుకోవచ్చు. ఇవి తాగితే ఎంతో ఆరోగ్యం. 

Homemade ORS Drink: ఎండలు మండిపోతున్నాయి. చెమటలు కారిపోతూ శరీరంలో ఉండే నీరంతా బయటికి వచ్చేస్తుంది. ఎంతోమంది డీహైడ్రేషన్ సమస్య బారిన పడతారు. దీంతో ఒంట్లో శక్తి అంతా పోయినట్టు నీరసంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ప్రతీసారి మెడికల్ షాపుకెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొనుక్కుని తాగుతారు. అలా కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా, ఆరోగ్యకరమైన ఓఆర్ఎస్ డ్రింక్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఇవి తయారు చేసుకోవడం చాలా సులువు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉప్పు, పంచదారతో ఓఆర్ఎస్ డ్రింక్

కావాల్సినవి: ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీళ్లు, అర టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల పంచదార.

ముందుగా ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. అందులో ఉప్పు, పంచదార వేసి అవి పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఓఆర్ఎస్ డ్రింక్. ఇది శరీరంలో కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్లను వేగంగా తిరిగి అందిస్తుంది.

నిమ్మరసంతో ఓఆర్ఎస్ డ్రింక్

కావాల్సినవి: ఒక గ్లాసు నీళ్లు, ఒక నిమ్మకాయ రసం, ఒక టీస్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు.

ఒక గ్లాసు నీటిలో తాజాగా పిండిన నిమ్మరసం కలపండి. ఆ తర్వాత పంచదార, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. నిమ్మతో చేసిన ఈ డ్రింక్ శరీరానికి వెంటనే రిఫ్రెష్‌మెంట్ ఇచ్చి, వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

కొబ్బరి నీళ్ల ఓఆర్ఎస్ డ్రింక్

కావాల్సినవి: ఒక గ్లాసు తాజా కొబ్బరి నీళ్లు, చిటికెడు నల్ల ఉప్పు, ఒక టీస్పూన్ తేనె.

ఒక గ్లాసు తాజా కొబ్బరి నీళ్లు తీసుకోండి. అందులో కొద్దిగా నల్ల ఉప్పు, తేనె వేసి బాగా కలపాలి. కొబ్బరి నీళ్లలో సహజంగానే ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని వేగంగా హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.

మజ్జిగ ఓఆర్ఎస్ డ్రింక్

కావాల్సినవి: ఒక గ్లాసు మజ్జిగ, చిటికెడు ఉప్పు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి.

ఒక గ్లాసు తాజా మజ్జిగ తీసుకోండి. ఈ మిశ్రమంలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. మజ్జిగ కడుపుకు చలవ చేస్తుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. 

తేనె, నిమ్మరసం ఓఆర్ఎస్ డ్రింక్

కావాల్సినవి: ఒక గ్లాసు నీళ్లు, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు ఉప్పు.

ఒక గ్లాసు నీటిలో తేనె, నిమ్మరసం కలపండి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసి, అది పూర్తిగా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేయాలి. ఇది రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కూడా సహాయపడుతుంది.

వేసవిలో ఇంట్లో తయారుచేసిన ఈ ఓఆర్ఎస్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ డ్రింక్స్ తయారు చేయడం చాలా సులభం, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.