అమరావతి: కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే  భారీ ఉద్యోగాల భర్తీని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జాతీయ ఆరోగ్యమిషన్‌ పరిధిలోని వివిధ కేటగిరీల్లో పనిచేసేందుకు 1,900 పోస్టుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ కు కూడా ప్రభుత్వం సిద్దమయ్యింది. 

ఈ నెల చివర్లో అంటూ 30 తేదీన ఈ పోస్టుల భర్తీకి కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10 వరకు అర్హత గల అభ్యర్దులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించి తుది జాబితాను అక్టోబర్ 17 తేదీన విడుదల చేయనున్నారు. అక్టోబర్ 19వ తేదీన నియామక పత్రాలను అందించనున్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాల్లో కలెక్టర్లే భర్తీ చేసుకునేలా వీలు కల్పించారు.  

మరోవైపు ఇటీవల భారీ ఎత్తున వైద్యుల పోస్టుల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంత పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేయడం ఇదే ప్రథమం . 9712 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 5701 కొత్త పోస్టుల భర్తీతోపాటు చాలా కాలంగా భర్తీ కాకుండా ఉన్న 4011 పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.