Asianet News TeluguAsianet News Telugu

మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఫ్రీగా లక్ష రూపాయలు పొందండి  

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలిచేలా సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉద్యోగాలకు ప్రిపేరు అయ్యే అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థికసాయం చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ ఆర్థిక సాయానికి అర్హులెవరో తెలుసా? 

Rajiv Gandhi Civils Abhayahastam Scheme: Financial Support for Telangana UPSC Aspirants AKP
Author
First Published Aug 26, 2024, 10:10 PM IST | Last Updated Aug 26, 2024, 10:12 PM IST

Rajiv Gandhi Civils Abhayahastam Scheme : దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాలు ఐఎఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్), ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీసెస్). ఆల్ ఇండియా స్థాయిలో చేపట్టే ఈ ఉద్యోగాల కోసం ప్రతి ఏటా లక్షలాదిమంది ప్రయత్నిస్తుంటారు. కానీ కేవలం వందల్లోనే ఉద్యోగాలు పొందుతుంటారు. ఇలా సివిల్స్ ర్యాంకర్లలో తెలంగాణ బిడ్డలు అధికంగా వుండాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం సాయం చేస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట లక్ష రూపాయల ఆర్థికసాయం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

ఇవాళ (సోమవారం) సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల చెక్కులు అందజేసారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సివిల్స్ ప్రిలిమ్స్ పాసయి మెయిన్స్ కు అర్హత సాధించిన యువతీయువకులకు సీఎం చెక్కుల అందజేసారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... సివిల్స్ లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటాలని కోరుకున్నారు. తెలంగాణ నుండి అత్యధికమంది విద్యార్థులు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎస్ఎఫ్ అధికారులుగా మారాలన్నారు. అందుకోసమే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఆర్థిక కష్టాలుంటే ఉపయోగపడతాయని లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. 

అత్యంత కఠినమైన సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ బిడ్డలకు కేవలం ఆర్థికసాయం చేయడమే ఈ ఆర్థిక ఉద్దేశం కాదన్నారు. అభ్యర్థులంతా తమ కుటుంబసభ్యులే అనే విశ్వాసం కల్పించడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఇక చెక్కుల పంపిణీ కార్యక్రమం సచివాలయంలోనే చేపట్టడం వెనకున్న అంతరార్థం ఏమిటో వివరించారు. ఈ సచివాలయం తెలంగాణ ప్రజలందరిది అనే నమ్మకం కలిగించేందుకే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు రేవంత్ తెలిపారు.  

ప్రస్తుతం సివిల్స్ కు ప్రిపేరవుతూ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించినవారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అయితే రానున్న రోజుల్లో మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. మొత్తంగా సివిల్స్ కు ప్రిపేరయ్యే తెలంగాణ బిడ్డలెవ్వరూ ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా నిలబడుతుందని సీఎం భరోసా ఇచ్చారు.  మీరు పరీక్షలపైనే దృష్టి పెట్టండి... అనుకున్నది సాధించి మీ కుటుంబానికి, రాష్ట్రానికి గౌరవం పెంచండని సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ సూచించారు. 

ఇక నిరుద్యోగులు, విద్యార్థుల ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఉద్యోగాలను భర్తీ చేసామన్నారు. కేవలం మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిని నిరూపించుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios