Middle East War : పాకిస్థాన్ లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అణు కార్యక్రమాలు, హార్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఇరు దేశాలు పట్టుబట్టడంతో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి.
పశ్చిమాసియాలో అశాంతికి పుల్‌స్టాప్ పెట్టాలని ప్రపంచ దేశాలు ఆశగా చూసిన అమెరికా-ఇరాన్ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ కలిబాఫ్ మధ్య జరిగిన ఈ మంతనాలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దాదాపు 14 గంటల పాటు సాగిన ఈ హై-వోల్టేజ్ డ్రామాలో ఇరు పక్షాలు తమ పంతాలను వీడకపోవడంతో శాంతి ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.
1979 తర్వాత తొలిసారి.. కానీ ఫలితం సున్నా!
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధులు ముఖాముఖి కూర్చోవడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రక సందర్భాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దగ్గరుండి పర్యవేక్షించారు. పశ్చిమాసియాలో రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత ఈ చర్చలు మొదలయ్యాయి. అయితే, కేవలం ఒక్క చర్చతోనే దశాబ్దాల శతృత్వం పోతుందని తాము భావించడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
జేడీ వాన్స్ ఏమన్నారంటే?
చర్చలు ముగిసిన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "మేము పెట్టిన నిబంధనలకు ఇరాన్ అంగీకరించలేదు. అందుకే ఎటువంటి ఒప్పందం లేకుండానే మేము వెనుదిరుగుతున్నాం. ఇరాన్ తన అణు ఆశయాలను పూర్తిగా వదులుకోవాలి. ఇది అమెరికా కంటే ఇరాన్‌కే పెద్ద నష్టం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ వైపు నుంచి కనీస నిబద్ధత కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.
తగ్గని ఇరాన్.. హార్ముజ్ జలసంధిపై పట్టు
మరోవైపు ఇరాన్ తన డిమాండ్లను స్పష్టంగా వినిపించింది. తమపై ఉన్న ఆంక్షలను తొలగించడంతో పాటు, విదేశాల్లో స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని కోరింది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలని ఇరాన్ పట్టుబట్టింది. అణు కార్యక్రమం విషయంలో కూడా అమెరికా పెట్టిన కఠిన నిబంధనలను ఇరాన్ తోసిపుచ్చింది.
ట్రంప్ విజయ గర్జన.. యుద్ధం ఆగదా?
ఇస్లామాబాద్ చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. "చర్చలతో సంబంధం లేకుండా యుద్ధంలో అమెరికాదే విజయం. హార్ముజ్ జలసంధి విషయంలో మేము వెనక్కి తగ్గేదే లేదు. అక్కడ ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్లను మేము తొలగిస్తాం" అని హెచ్చరించారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్ అనుకూల గ్రూపులపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేయడంతో శాంతి అచూకీ లేకుండా పోయింది.
ఆందోళనలో ప్రపంచ దేశాలు
ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని తన గుప్పిట్లోకి తీసుకోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్థాన్, ఒమన్ దేశాలు ఇరు పక్షాలను శాంతించమని కోరుతున్నా, ప్రస్తుతానికి అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య కోల్డ్ వార్ కాస్తా హాట్ వార్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


