Trump threatens India over Russian oil భారతదేశంపై సుంకాలను మరింతగా పెంచుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్ రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడమే కాకుండా, దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మి భారీ లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు

Trump threatens India: భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారతదేశంపై సుంకాలను మరింతగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. భారత్ రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడమే కాకుండా, దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మి భారీ లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ లో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఆయుధాల వల్ల ఎంత మంది చనిపోతున్నారో భారత్ కు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో, భారత్ దిగుమతులపై సుంకాన్ని గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించారు ఇప్పటికే ట్రంప్ 2025 ఆగస్టు 1 నుంచి భారత్ దిగుమతులపై కనీసం 25% టారిఫ్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.

రష్యా నుండి చమురు ఎందుకు కొనుగోలు చేస్తోంది?

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా దేశాల అభ్యంతరాలను భారత్‌ సోమవారం గట్టిగా తిప్పికొట్టింది. ఆ దేశాలు తమను లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా, యూరోపియన్ దేశాలు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. వాస్తవానికి, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ సాంప్రదాయ చమురు మార్కెట్ల నుండి యూరప్‌కు ముడి చమురు పంపడం ప్రారంభించినప్పుడే భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోంది. తద్వారా అది తన ప్రజలకు సరసమైన ధరలకు ఇంధనాన్ని అందిస్తుంది.

వాస్తవం ఏమిటంటే భారతదేశంపై ఆరోపణలు చేస్తున్న దేశాలు స్వయంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి. అయితే, అలా చేయడం వారి జాతీయ ప్రయోజనాలకు సంబంధించినది కాదు. ఇతర ప్రయోజానాలు కూడా ఉన్నాయి. 2024 లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యం చేసింది. ఇది రష్యాతో భారతదేశం మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ. యూరప్, రష్యా మధ్య ఎరువులు, మైనింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు మొదలైన వాటి వ్యాపారం జరుగుతుంది..

ఇక అమెరికా విషయానికొస్తే, అది ఇప్పటికీ రష్యా నుండి యురేనియం కొనుగోలు చేస్తోంది. దాని ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ కోసం రష్యా నుండి పల్లాడియం కొనుగోలు చేస్తోంది. అటువంటి నేపథ్యంలో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం, ఇతర దేశాల మాదిరిగానే, భారతదేశం కూడా దాని జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

భారత్ చమురు కొనుగోలుపై ట్రంప్

ట్రంప్ సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్‌లో ఒక సందేశం రాసిన తర్వాత భారతదేశం ఈ విధంగా స్పందించింది. దీనిలో ట్రంప్ తన సాధారణ శైలిలో భారతదేశం రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేయడమే కాకుండా, కొనుగోలు చేసిన చమురులో ఎక్కువ భాగాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తోందని రాశారు. ఉక్రెయిన్‌లో రష్యన్ ఆయుధాల వల్ల ఎంత మంది చనిపోతున్నారో వారికి పట్టింపు లేదు. దీని కారణంగా, నేను భారతదేశంపై సుంకాన్ని భారీగా పెంచబోతున్నాను. అంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా ట్రంప్ నిరంతరం భారత్‌పై అభ్యంతరకరమైన ప్రకటనలు చేస్తున్నారు.

భారత్ పై ట్రంప్ అభ్యంతరకర ప్రకటనలు

గత వారం పదిరోజులుగా ట్రూత్ సోషల్ ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై అభ్యంతరకరమైన ప్రకటనలు చేస్తున్నారు. గత వారం ప్రారంభంలో భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందని ట్రంప్ ఆరోపించినప్పుడు, విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనికి చాలా జాగ్రత్తగా స్పందించింది. అమెరికా పరిపాలన భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన రోజున, ట్రంప్ ప్రత్యేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పోస్ట్ చేశారు. అందులో భారత్ , రష్యా తమ చనిపోయిన ఆర్థిక వ్యవస్థతో మునిగిపోయినా నేను ఆందోళన చెందడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.

ఒప్పందం కోసమేనా

ఇక తాజాగా (సోమవారం) భారత్ స్పందించిన తీరు చూస్తే.. ఇకపై దౌత్యపరమైన అంశాలను పాటించబోవడం లేదని స్పష్టమవుతోంది. ట్రంప్ ప్రకటన కూడా ఆయన మునుపటి ప్రకటనల మాదిరిగానే అస్పష్టంగా ఉంది. గతంలో ఆయన భారతదేశంపై సుంకం (25 శాతం)తో పాటు ప్రత్యేక జరిమానా విధించబడుతుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు జరిమానా రేటు ఎంత ఉంటుందో స్పష్టంగా తెలియలేదు. అదే విధంగా సోమవారం ఆయన చేసిన ప్రకటనలో అస్పష్టత ఉంది. కానీ, ఈ ప్రకటన భారతదేశంపై వాణిజ్య ఒప్పందం కోసం ఒత్తిడి తీసుకురావడానికి కూడా చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది.