అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన 25% సుంకం వల్ల ఏ రంగాలు దెబ్బతింటాయి? ఇండియా వాణిజ్యం దెబ్బతింటుందా? అనేది ఇక్కడ తెలుసుకుందాం.   

DID YOU
KNOW
?
ఐటీకి పెద్ద దెబ్బే..
భారతదేశం నుండి ఎగుమతయ్యే ఐటీ సేవల్లో అమెరికాదే అగ్రస్థానం. 2024 లో ఇండియా ఐటీ సర్విసుల ఎగుమతుల్లో అమెరికా వాటా 54 శాతం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్ట్ 1, 2025 నుండి భారత ఎగుమతులపై 25% సుంకం విధించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది భారత వాణిజ్య రంగాలను కుదిపేస్తోంది. ఈ నిర్ణయం ముఖ్యంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, వస్త్రాల వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ డిమాండ్ ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సమయంలో సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగించి లాభాలను తగ్గించే అవకాశం ఉంది.

ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌లో భారతదేశం "అత్యంత కఠినమైన వాణిజ్య అడ్డంకులను కలిగి ఉన్న దేశం" అని ఆరోపించారు. ఇక్కడ విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికమని అన్నారు. రష్యాతో భారతదేశం భారీగా వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నందున మరింత జరిమానాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత అనుకూల ట్రంప్ నుండి అనుకూల నిర్ణయాలు ఆశించారు ప్రజలు. కానీ తాజా సుంకాల ప్రకటన ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వియత్నాం, ఇండోనేషియా, జపాన్ వంటి ప్రాంతీయ దేశాల ఎగుమతులపై సుంకాలు వరుసగా 20%, 19%, 15% వద్ద పరిమితం చేయబడ్డాయి.

సుంకాలు పూర్తిగా అమలు చేస్తే జూలై, సెప్టెంబర్ మధ్య భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 10% ప్రభావితం కావచ్చని అంతర్గత అంచనాలు చెబుతున్నాయి. 2024లో ఇండియా-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 129.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది.

రంగాల వారీగా ఖచ్చితమైన సుంకాలు ఇంకా ప్రకటించలేదు. అయితే ఓ అంచనా ప్రకారం దెబ్బతినే అవకాశాలున్న రంగాలివే

ఫార్మాస్యూటికల్స్

భారతదేశం అమెరికాకు జెనరిక్ మందులను అత్యధికంగా సరఫరా చేస్తుంది. ఏటా దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన మందులను ఎగుమతి చేస్తుంది. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా వంటి కంపెనీలు తమ ఆదాయంలో మూడో వంతు కంటే ఎక్కువ యూఎస్ నుండి సంపాదిస్తున్నాయి. 2022లో భారత జెనరిక్ మందులు యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు 220 బిలియన్ డాలర్లకు పైగా ఆదా చేసినప్పటికీ, సుంకాల షాక్ ఈ వాణిజ్యాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.

ఆభరణాలు

భారతదేశం జెమ్ అండ్ జ్యువెలరీ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఈ సుంకాలను ఆందోళనకరంగా భావిస్తోంది. ఏటా అమెరికాకి 10 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు పంపే ఈ రంగాన్ని తాజా సుంకాలు తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొంది. 25% సుంకం ఖర్చులను పెంచుతుంది, షిప్‌మెంట్‌లను ఆలస్యం చేస్తుందంది. కళాకారుల నుండి ఎగుమతిదారుల వరకు విలువ గొలుసులో ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తుందంది.

వస్త్రాలు

వాల్‌మార్ట్, గ్యాప్, కాస్ట్‌కో వంటి యూఎస్ దిగ్గజాలకు వస్త్రాలు, గృహ వస్త్రాలు, పాదరక్షల ఎగుమతి చేస్తాయి భారతీయ సంస్థలు. ఈ సుంకాలతో వీరు నష్టపోతారు… వియత్నాం, బంగ్లాదేశ్‌ లు లాభపడే అవకాశాలుంటాయి. కొత్త సుంకాలు వర్ధమాన్ టెక్స్‌టైల్స్, వెల్స్పన్ లివింగ్ వంటి ప్రధాన ఎగుమతిదారులతో సహా భారతీయ కంపెనీలను దెబ్బతీసే అవకాశాలున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ తెలిపింది.

చమురు శుద్ధి కర్మాగారాలు

ఇండియన్ ఆయిల్ కార్ప్, BPCL, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి చమురు శుద్ధి కర్మాగారాలు పరోక్షంగా నష్టపోవచ్చు. భారతదేశం తన ముడి చమురులో దాదాపు 37% రష్యా నుండి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటుంది. కానీ భారతదేశం రష్యన్ చమురు దిగుమతులపై ట్రంప్ జరిమానాలు విధించాలని సూచించడంతో, శుద్ధి కర్మాగారాలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, తగ్గుతున్న లాభాల ద్వారా దెబ్బతినవచ్చు.

ఎలక్ట్రానిక్స్

స్మార్ట్‌ఫోన్ అసెంబ్లీకి ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఇప్పుడు ఈ రంగం ఒక ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. చైనా సుంకాలను నివారించడానికి భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేయడానికి ఆపిల్ ముందుకువచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్యూహాన్ని యాపిల్ మార్చుకోవచ్చు. 25% సుంకం ఆపిల్ తన సోర్సింగ్ వ్యూహాన్ని పునరాలోచించుకోవలసి వస్తుందని విశ్లేషకులు హెచ్చరించారు.